యెషయా 5:16-30
16
కాని సైన్యాల యెహోవా తీర్పు తీర్చి మహిమపరచబడతారు, తన నీతి క్రియలనుబట్టి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధునిగా నిరూపించబడతారు.
17
అప్పుడు గొర్రెపిల్లలు తమ పచ్చికబయళ్లలో ఉన్నట్లుగా అక్కడ మేస్తాయి; ధనవంతుల బీడు భూములలో గొర్రెపిల్లలు మేస్తాయి.
18
మోసమనే త్రాళ్లతో పాపాన్ని లాక్కొనే వారికి, బండి త్రాళ్లతో దుర్మార్గాన్ని లాక్కొనే వారికి శ్రమ.
19
“దేవుడు త్వరపడాలి; ఆయన పనిని త్వరగా చేయాలి అప్పుడు ఆయన కార్యాలు మేము చూస్తాము. ఇశ్రాయేలు పరిశుద్ధుని ఆలోచన ఆచరణలోకి రావాలి, అప్పుడు మేము తెలుసుకుంటాము” అనే వారికి శ్రమ.
20
కీడును మేలని, మేలును కీడని చెప్పేవారికి, చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా చేదును తీపిగా తీపిని చేదుగా మార్చేవారికి శ్రమ.
21
తమకు తామే జ్ఞానులమని తమ దృష్టిలో తామే తెలివైనవారమని అనుకునేవారికి శ్రమ.
22
ద్రాక్షరసం త్రాగడంలో పేరు పొందినవారికి మద్యం కలపడంలో నేర్పు గలవారికి శ్రమ.
23
వారు లంచం తీసుకుని దోషులను వదిలేస్తారు, నిర్దోషులకు న్యాయం చేయడానికి నిరాకరిస్తారు.
24
వారు సైన్యాల యెహోవా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్యాన్ని తృణీకరించారు, కాబట్టి మంటలు గడ్డిని కాల్చినట్లుగా ఎండుగడ్డి మంటలో కాలిపోయినట్లుగా వారి వేరులు కుళ్లిపోతాయి, వారి పూలు ధూళిలా ఎగిరిపోతాయి.
25
కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతుంది; ఆయన వారి మీదికి తన చేయి చాచి వారిని కొడతారు. పర్వతాలు వణుకుతాయి, వీధుల్లో వారి శవాలు పెంటలా పడి ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
26
ఆయన దూరంగా ఉన్న దేశాలను పిలువడానికి జెండా ఎత్తుతారు, భూమి అంచుల్లో ఉన్నవారిని రప్పించడానికి ఈల వేస్తారు. చూడండి వారందరు తొందరగా, వేగంగా వస్తున్నారు.
27
వారిలో ఒక్కరు కూడా అలిసిపోరు, తూలిపోరు. వారిలో ఒక్కరు కూడా కునుకరు నిద్రపోరు. వారి నడికట్టు విడిపోదు. వారి చెప్పుల వారు తెగిపోదు.
28
వారి బాణాలు పదునుగా ఉన్నాయి. వారి విల్లులన్ని ఎక్కుపెట్టి ఉన్నాయి; వారి గుర్రాల డెక్కలు చెకుముకి రాళ్లవలె ఉన్నాయి, వారి రథచక్రాలు సుడిగాలి తిరిగినట్టు తిరుగుతాయి.
29
వారి గర్జన సింహగర్జనలా ఉంది. కొదమసింహం గర్జించినట్లు గర్జిస్తారు; వారు తమ వేటను పట్టుకుని ఎత్తుకుపోతారు కాపాడే వారెవరు ఉండరు.
30
వారు ఆ రోజు సముద్ర ఘోషలా తమ శత్రువు మీద గర్జిస్తారు. ఒకవేళ ఎవరైనా భూమివైపు చూస్తే, అక్కడ చీకటి, బాధ మాత్రమే కనబడుతుంది; మేఘాలు కమ్మి వెలుగు కూడా చీకటిగా అవుతుంది.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings