ఆదికాండము 8:13-22
13
నోవహు యొక్క 601 వ సంవత్సరం మొదటి నెల మొదటి దినాన భూమి మీద నీళ్లు ఎండిపోయాయి. అప్పుడు నోవహు ఓడ కప్పు తెరిచి చూస్తే నేల ఆరిపోయి కనిపించింది.
14
రెండవ నెల ఇరవై ఏడవ రోజు నాటికి భూమి పూర్తిగా ఆరిపోయింది.
15
అప్పుడు దేవుడు నోవహుతో,
16
“నీవూ, నీ భార్య, నీ కుమారులు, వారి భార్యలు, ఓడలో నుండి బయటకు రండి.
17
నీతో ఉన్న ప్రతి జీవిని అంటే పక్షులు, జంతువులు, నేల మీద ప్రాకే ప్రాణులన్నిటిని బయటకు తీసుకురా, అప్పుడు అవి భూమి మీద ఫలించి, వృద్ధి చెంది, విస్తరిస్తాయి” అని అన్నారు.
18
నోవహు, తన భార్య, కుమారులు, కుమారుల భార్యలతో పాటు బయటకు వచ్చాడు.
19
జంతువులు, నేల మీద ప్రాకే జీవులు, పక్షులు, భూమి మీద తిరిగే జీవులన్నీ ఒక జాతి వెంబడి మరో జాతి, వాటి వాటి జంటల ప్రకారం ఓడలో నుండి బయటకు వచ్చాయి.
20
అప్పుడు నోవహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి, జంతువుల్లో పక్షుల్లో పవిత్రమైనవాటిలో కొన్ని తీసి ఆ బలిపీఠంపై దహనబలి అర్పించాడు.
21
యెహోవా ఆ బలి అర్పణ యొక్క ఇష్టమైన సువాసన పీల్చుకుని తన హృదయంలో ఇలా అనుకున్నారు: “మనుష్యుల హృదయాలోచన బాల్యం నుండే చెడ్డది అయినప్పటికీ, ఇక ఎన్నడు మనుష్యుల కారణంగా భూమిని శపించను. నేను ఇప్పుడు చేసినట్టు ఇంకెప్పుడు సమస్త జీవులను నాశనం చేయను.
22
“ఈ భూమి ఉన్నంత కాలం, నాటే కాలం కోతకాలం, చలి వేడి, ఎండకాలం చలికాలం, పగలు రాత్రి, ఎప్పుడూ నిలిచిపోవు.”
Settings