2 రాజులు 9:7-28
7
నీవు నీ యజమాని అహాబు వంశీకులను హతం చేయాలి, యెజెబెలు ద్వారా నా సేవకులైన ప్రవక్తలు, యెహోవా సేవకులందరి రక్తం చిందింపబడింది కాబట్టి నేను ప్రతీకారం తీసుకుంటాను.
8
అహాబు వంశం పూర్తిగా నశిస్తుంది. ఇశ్రాయేలులో అహాబుకు చెందిన ప్రతి చివరి మగవారిని వారు బానిసలైనా పౌరులైనా నిర్మూలం చేస్తాను.
9
నేను నెబాతు కుమారుడైన యరొబాము వంశాన్ని, అహీయా కుమారుడైన బయెషా వంశాన్ని చేసినట్టే, అహాబు వంశాన్ని చేస్తాను.
10
యెజెబెలును యెజ్రెయేలు ప్రాంతంలో కుక్కలు తింటాయి, ఎవరూ ఆమెను సమాధి చేయరు.’ ” తర్వాత అతడు తలుపు తెరిచి పరుగెత్తాడు.
11
యెహు తన తోటి అధికారుల దగ్గరకు వెళ్లినప్పుడు, వారిలో ఒకరు, “అంతా క్షేమమేనా? ఆ వెర్రివాడు నీ దగ్గరకు ఎందుకు వచ్చాడు?” అని అడిగాడు. అందుకు యెహు అన్నాడు, “అతడు, అతని మాటలు మీకు తెలుసు కదా.”
12
వారు అన్నారు, “అది నిజం కాదు, అసలేం జరిగిందో మాకు చెప్పు.” యెహు అన్నాడు, “అతడు నాతో ఇలా అన్నాడు: ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా అభిషేకించాను.’ ”
13
వెంటనే వారు తమ వస్త్రాలను తీసి యెహు కాళ్లక్రింద పరిచారు. తర్వాత వారు బూర ఊది, “యెహు రాజయ్యాడు” అని కేకలు వేశారు.
14
నిమ్షీ మనుమడు, యెహోషాపాతు కుమారుడైన యెహు యోరాము మీద కుట్ర చేశాడు. (ఆ సమయంలో యోరాము, ఇశ్రాయేలీయులంతా అరాము రాజైన హజాయేలు నుండి రామోత్ గిలాదును కాపలా కాస్తూ ఉన్నారు,
15
కాని, రాజైన యెహోరాము అరాము రాజైన హజాయేలుతో యుద్ధంలో అరామీయుల వల్ల తగిలిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలు పట్టణానికి తిరిగి వెళ్లాడు.) అప్పుడు యెహు, “మీరు నన్ను రాజుగా చేయాలనుకుంటే, ఈ విషయాన్ని యెజ్రెయేలుకు వెళ్లి చెప్పడానికి ఇక్కడినుండి ఎవరూ తప్పించుకుని వెళ్లకుండా చూడండి” అన్నాడు.
16
అప్పుడు యెహు తన రథం ఎక్కి యెజ్రెయేలుకు వెళ్లాడు, ఎందుకంటే అక్కడ యోరాము విశ్రాంతి తీసుకుంటున్నాడు, యూదా రాజైన అహజ్యా అతన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్లాడు.
17
యెజ్రెయేలు గోపురం మీద నిలుచున్న కావలివాడు యెహు, అతని సైనికుల గుంపు రావడం చూసి, “నాకు సైనికులు కొంతమంది వస్తున్నట్లు కనిపిస్తుంది” అని బిగ్గరగా అరిచాడు. అందుకు యెహోరాము, “ఒక రౌతును పిలిపించి, వారిని కలవడానికి పంపించు, అతడు వారితో, ‘సమాధానంగా వస్తున్నారా?’ అని అడుగు” అని ఆదేశించాడు.
18
ఆ గుర్రాన్ని స్వారీ చేసేవాడు యెహుకు ఎదురుగా వెళ్లి, “రాజు ఇలా అడుగుతున్నారు: ‘మీరు సమాధానంతో వస్తున్నారా?’ ” “సమాధానంతో నీకేం పని?” అని యెహు జవాబిచ్చాడు. “నా వెనుకకు వచ్చి నన్ను వెంబడించు.” కావలివాడు, “ఆ దూత వారిని చేరుకున్నాడు, కాని అతడు తిరిగి రావడం లేదు” అని చెప్పాడు.
19
కాబట్టి రాజు ఇంకొక గుర్రపురౌతును పంపించాడు. అతడు వారి దగ్గరకు వెళ్లి, “రాజు ఇలా అడుగుతున్నాడు: ‘మీరు సమాధానంతో వస్తున్నారా?’ ” అని అన్నాడు. అందుకు యెహు, “సమాధానంతో నీకేం పని? నా వెనుకకు వచ్చి నన్ను వెంబడించు” అన్నాడు.
20
కావలివాడు, “అతడు వారిని చేరుకున్నాడు, కాని అతడు కూడా తిరిగి రావడం లేదు. ఆ రథాలు నడవడం నిమ్షీ మనుమడు యెహు నడిచినట్లు ఉంది, వెర్రిపట్టినవానిలా తోలుతున్నాడు” అని తెలియజేశాడు.
21
యెహోరాము, “నా రథం సిద్ధం చెయ్యండి” అని ఆదేశించాడు. అది సిద్ధం అయినప్పుడు, ఇశ్రాయేలు రాజైన యెహోరాము, యూదా రాజైన అహజ్యా యెహును ఎదుర్కోడానికి తమ రథాలతో బయలుదేరారు. వారు అతన్ని యెజ్రెయేలు పట్టణస్థుడైన నాబోతుకు చెందిన పొలంలో కలుసుకున్నారు.
22
యెహోరాము యెహును చూడగానే, “సమాధానంతో వచ్చావా, యెహు?” అని అడిగాడు. అందుకు యెహు, “మీ తల్లి యెజెబెలు విగ్రహారాధనను మంత్రవిద్యను ప్రోత్సహిస్తున్నంత కాలం, సమాధానం ఎలా ఉంటుంది?” అని జవాబిచ్చాడు.
23
యెహోరాము అహజ్యాతో, “అహజ్యా, ఇది మోసం!” అని అంటూ తన రథం త్రిప్పి పారిపోయాడు.
24
అయితే యెహు తన విల్లు ఎక్కుపెట్టి గురి చూసి యెహోరాము భుజాల మధ్యకు కొట్టాడు. ఆ బాణం అతని గుండెను చీల్చుకుంటూ పోవడం వలన అతడు తన రథంలో వాలిపోయాడు.
25
అప్పుడు యెహు తన రథసారధియైన బిద్కరుతో అన్నాడు, “అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు పొలంలో పడవేయి. ఒకసారి మనమిద్దరం రథమెక్కి అతని తండ్రి అహాబు వెంట పడుతున్నప్పుడు, యెహోవా అహాబు గురించి చెప్పిన ప్రవచనం జ్ఞాపకం చేసుకో:
26
‘నిన్నటి రోజు నేను నాబోతు రక్తం అతని కుమారుల రక్తం చూశాను, ఖచ్చితంగా ఈ పొలంలోనే నీకు ప్రతీకారం చేస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.’ కాబట్టి ఇప్పుడు అతన్ని ఎత్తి ఆ పొలంలో పడవెయ్యి.”
27
జరిగినదంతా యూదా రాజైన అహజ్యా చూసినప్పుడు, అతడు బేత్-హగ్గాన్ మార్గం గుండా పారిపోయాడు. యెహు అతని వెంటపడి, “అతన్ని కూడా చంపండి!” అని ఆజ్ఞాపించాడు. వారు గూరుకు పోయే త్రోవలో ఇబ్లెయాము దగ్గర అతన్ని తన రథంలో గాయపరిచారు, అయితే అతడు మెగిద్దోకు తప్పించుకుని వెళ్లి అక్కడ మృతిచెందాడు.
28
అతని సేవకులు అతన్ని రథంలో యెరూషలేముకు తీసుకెళ్లి, దావీదు పట్టణంలో అతని పూర్వికుల దగ్గర అతన్ని సమాధి చేశారు.
Settings