Skip to content
2 దినవృత్తాంతములు 35:20-27

2 దినవృత్తాంతములు 35:20-27

20
ఇదంతా జరిగిన తర్వాత, యోషీయా మందిరాన్ని చక్కబెట్టిన తర్వాత ఈజిప్టు రాజైన నెకో యూఫ్రటీసు నది ఒడ్డున ఉన్న కర్కెమీషు మీదికి యుద్ధానికి వెళ్తుండగా యోషీయా అతని మీదికి బయలుదేరాడు.
21
కానీ నెకో అతని దగ్గరకు దూతలను పంపి, “యూదా రాజా, నీకు నాకూ మధ్య ఎలాంటి గొడవ ఉంది? ఈ సమయంలో నేను దాడి చేస్తున్నది మీపై కాదు, నేను యుద్ధం చేస్తున్న ఇంటిపై. దేవుడు నాకు త్వర పడమని చెప్పాడు; కాబట్టి నాతో ఉన్న దేవున్ని ఎదిరించడం మానేయండి, లేదంటే ఆయనే నిన్ను నాశనం చేస్తాడు” అని చెప్పాడు.
22
అయితే యోషీయా అతని దగ్గర నుండి వెళ్లడానికి ఇష్టపడలేదు. అతనితో యుద్ధం చేయాలని మారువేషం వేసుకుని దేవుని ఆజ్ఞగా నెకో చెప్పిన దానిని వినక, మెగిద్దోను మైదానాల్లో యుద్ధం చేయడానికి వెళ్లాడు.
23
విలుకాండ్రు రాజైన యోషీయా మీద బాణాలు వేశారు. రాజు తన అధికారులతో, “నేను తీవ్రంగా గాయపడ్డాను. ఇక్కడినుండి నన్ను తీసుకెళ్లండి” అని చెప్పాడు.
24
అతని సేవకులు అతన్ని తన రథం మీద నుండి దించి అతనికున్న వేరే రథం మీద ఉంచి యెరూషలేముకు తీసుకువచ్చారు. అక్కడ అతడు చనిపోయాడు. అతని పూర్వికుల సమాధుల మధ్య యోషీయాను పాతిపెట్టారు. అతని మృతికి యూదా, యెరూషలేము ప్రజలంతా దుఃఖించారు.
25
యిర్మీయా యోషీయా గురించి శోకగీతాన్ని రచించాడు. ఈ రోజు వరకు గాయనీ గాయకులందరు తమ విలాపవాక్కులలో యోషీయాను జ్ఞాపకం చేసుకుంటూ ఆలపిస్తారు. ఇలా చేయడం ఇశ్రాయేలులో ఒక ఆచారంగా మారింది.
26
యోషీయాను గురించిన ఇతర విషయాలు యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాసిన మాట అనుసరించి అతడు దయతో చేసిన పనులు,
27
మొదటి నుండి చివరి వరకు అతడు చేసిన పనులన్నీ ఇశ్రాయేలు, యూదా రాజుల గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options