Skip to content
2 దినవృత్తాంతములు 14:2-15

2 దినవృత్తాంతములు 14:2-15

2
ఆసా యెహోవా దృష్టిలో మంచిది, సరియైనది చేశాడు.
3
అతడు ఇతర దేవుళ్ళ బలిపీఠాలను, క్షేత్రాలను తొలగించాడు. అషేరా దేవి స్తంభాలను పడగొట్టించాడు.
4
అతడు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను వారు తెలుసుకొని, ఆయన నియమాలను ఆజ్ఞలను అనుసరించాలని యూదా ప్రజలకు ఆజ్ఞాపించాడు.
5
అతడు యూదాలోని ప్రతి పట్టణంలోని ఉన్నత క్షేత్రాలను, ధూపవేదికలను తొలగించాడు. అతని పరిపాలనలో దేశం ప్రశాంతంగా ఉంది.
6
దేశం ప్రశాంతంగా ఉన్నప్పుడు అతడు యూదాలో కోటగోడలు గల పట్టణాలు కట్టించాడు. యెహోవా అతనికి విశ్రాంతి ఇవ్వగా ఆ సంవత్సరాల్లో అతనితో ఎవరూ యుద్ధం చేయలేదు.
7
ఆసా యూదా వారితో, “మనం యెహోవాను వెదికి అనుసరించాం కాబట్టి ఈ దేశం ఇంకా మన స్వాధీనంలోనే ఉంది. ఆయనను వెదకి అనుసరించాం కాబట్టి మనం ఈ పట్టణాలను కట్టి, వాటికి చుట్టూ గోడలు, గోపురాలు, ద్వారాలు, అడ్డగడియలు అమర్చుదాం” అన్నాడు. అలాగే వారు పట్టణాలను కట్టి వర్థిల్లారు.
8
ఆసాకు యూదా వారిలో 3,00,000 మంది సైనికులు ఉన్నారు. వారికి పెద్ద డాళ్లు ఈటెలు ఉన్నాయి. అతనికి బెన్యామీనీయులలో 2,80,000 మంది సైనికులున్నారు. వారికి చిన్న డాళ్లు, విల్లులు ఉన్నాయి. వీరంతా పోరాట యోధులు.
9
తర్వాత కూషు వాడైన జెరహు వేవేల సైన్యంతో, మూడువందల రథాలతో వారిపైకి దండెత్తి మరేషా పట్టణం వరకు వచ్చాడు.
10
ఆసా అతన్ని ఎదుర్కోడానికి వెళ్లాడు. వారు మరేషాకు దగ్గరలో ఉన్న జెపాతా లోయలో బారులు తీరారు.
11
అప్పుడు ఆసా యెహోవాకు, “యెహోవా, బలవంతులతో యుద్ధంలో బలహీనులకు సహాయం చేయడానికి మీరు తప్ప ఇంకెవరు లేరు. యెహోవా, మా దేవా! మేము మీమీద నమ్మకం పెట్టుకున్నాము. మీ పేర మేము ఈ మహా సైన్యాన్ని ఎదిరించడానికి వచ్చాం కాబట్టి సాయం చేయండి. యెహోవా మీరే మా దేవుడు. మానవమాత్రులను మీకు వ్యతిరేకంగా నిలువనీయకండి” అని ప్రార్థన చేశాడు.
12
ఆసా ఎదుట యూదా వారి ఎదుట యెహోవా కూషువారిని మొత్తగా వారు పారిపోయారు.
13
ఆసా, అతనితో ఉన్నవారు వారిని గెరారు వరకు వెంటాడారు. కూషు వారిలో చాలామంది కూలారు, కాబట్టి వారు మళ్ళీ బలాన్ని కూడగట్టుకోలేక యెహోవా ఎదుట ఆయన సైన్యం ఎదుట నుండి పారిపోయారు. యూదా వారు అధిక మొత్తంలో దోపుడుసొమ్ము దోచుకున్నారు.
14
గెరారు చుట్టూరా ఉన్న గ్రామాలను యెహోవా భయం ఆవరించింది కాబట్టి యూదా వారు వాటన్నిటిని ఓడించి దోచుకొని, చాలా దోపుడుసొమ్ము తీసుకున్నారు.
15
వారు పశువుల కాపరుల గుడారాలపై కూడా దాడి చేశారు. అంతేకాదు గొర్రెలు, మేకలు ఒంటెల మందలను కూడా తీసుకెళ్లారు. తర్వాత వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options