Przejdź do treści
1 సమూయేలు 16:1-13

1 సమూయేలు 16:1-13

1
యెహోవా సమూయేలుతో, “ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలు గురించి నీవెంత కాలం దుఃఖపడతావు? నీ కొమ్మును నూనెతో నింపి నీవు బయలుదేరు; బేత్లెహేమీయుడైన యెష్షయి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా ఏర్పరచుకున్నాను” అన్నారు.
2
అయితే సమూయేలు, “నేను ఎలా వెళ్లను? నేను వెళ్లిన సంగతి సౌలు వింటే అతడు నన్ను చంపేస్తాడు” అన్నాడు. అందుకు యెహోవా, “నీతో పాటు ఒక లేగదూడను తీసుకెళ్లి, ‘యెహోవాకు బలివ్వడానికి వచ్చాను’ అని చెప్పు.
3
ఆ బలికి యెష్షయిని రమ్మను, అప్పుడు నీవు ఏం చేయాలో నేను నీకు చెప్తాను. నేను సూచించే వాన్ని నీవు అభిషేకించాలి” అని చెప్పారు.
4
యెహోవా చెప్పిన ప్రకారం సమూయేలు చేశాడు. అతడు బేత్లెహేముకు చేరుకున్నప్పుడు, ఆ పట్టణ పెద్దలు అతడు రావడం చూసి భయపడి, “సమాధానంగా వస్తున్నావా?” అని అడిగారు.
5
అందుకు సమూయేలు, “అవును, సమాధానంగానే వచ్చాను, యెహోవాకు బలి అర్పించడానికి వచ్చాను. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని నాతోకూడ బలి ఇవ్వడానికి రండి” అని చెప్పి, యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలివ్వడానికి వారిని పిలిచాడు.
6
వారు వచ్చినప్పుడు సమూయేలు ఏలీయాబును చూసి, “ఖచ్చితంగా యెహోవా అభిషేకించినవాడు యెహోవా ఎదుట నిలబడ్డాడు” అనుకున్నాడు.
7
అయితే యెహోవా సమూయేలుతో, “అతని రూపాన్ని ఎత్తును చూసి అలా అనుకోవద్దు, నేను అతన్ని తిరస్కరించాను. మనుష్యులు చూసే వాటిని యెహోవా చూడరు. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు కాని యెహోవా హదృయాన్ని చూస్తారు” అన్నారు.
8
యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుట నిలబెట్టాడు కాని సమూయేలు, “యెహోవా ఇతన్ని ఎంచుకోలేదు” అన్నాడు.
9
అప్పుడు యెష్షయి షమ్మాను పిలిచాడు కాని సమూయేలు, “ఇతన్ని కూడా యెహోవా ఎంచుకోలేదు” అన్నాడు.
10
అలా యెష్షయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుట నిలబెట్టాడు కాని సమూయేలు, “యెహోవా వీరెవరిని ఎంచుకోలేదు” అని చెప్పి,
11
నీ కుమారులంతా వీరేనా? అని యెష్షయిని అడిగాడు. అందుకు యెష్షయి, ఇంకా చివరివాడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడని చెప్పాడు. అందుకు సమూయేలు, “అతన్ని పిలిపించు; అతడు వచ్చేవరకు మనం భోజనం చేయము” అన్నాడు.
12
కాబట్టి యెష్షయి అతన్ని పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు ఎర్రగా అందమైన కళ్లతో మంచి రూపంతో ఉన్నాడు. అప్పుడు యెహోవా, “నేను ఎన్నుకున్నది ఇతన్నే, నీవు లేచి అతన్ని అభిషేకించు” అన్నారు.
13
కాబట్టి సమూయేలు నూనె కొమ్మును తీసుకుని అతని సోదరుల ఎదుట అతన్ని అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చేది. ఆ తర్వాత సమూయేలు రామాకు వెళ్లిపోయాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options