యోబు3
Listen to this chapter
0:00
0:00
యోబు మౌనము విడిచుట
1
ఆ తర్వాత, యోబు మాట్లాడడం మొదలుపెట్టి తాను పుట్టిన రోజును శపించాడు.
2
యోబు ఇలా అన్నాడు:
పుట్టిన దినమును శపించుట
3
“నేను పుట్టిన రోజు, ‘మగ శిశువు పుట్టాడని!’ చెప్పిన ఆ రాత్రి లేకపోవును గాక.
4
ఆ రోజు చీకటి అగును గాక; పైనున్న దేవుడు దాన్ని లెక్కచేయకుండును గాక; దాని మీద వెలుగు ప్రకాశించకూడదు.
5
చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరకు తీసుకొనును గాక; మేఘం దాన్ని కమ్మును గాక; పగటిని కమ్మే అంధకారం దాన్ని భయపెట్టును గాక.
6
కటిక చీకటి ఆ రాత్రిని పట్టుకొనును గాక; సంవత్సరపు రోజుల్లో ఒకరోజుగా అది లెక్కించబడకపోవును గాక, ఏ నెలలోను అది చేర్చబడకపోవును గాక.
7
ఆ రాత్రి గొడ్రాలిగా ఉండును గాక; దానిలో సంతోష ధ్వని వినిపించకపోవును గాక.
8
రోజులను శపించేవారు, లెవియాథన్ రెచ్చగొట్టే అనుభవం గలవారు ఆ రోజును శపించుదురు గాక.
9
దాని అరుణోదయ నక్షత్రాలు చీకటిమయం అగును గాక; వెలుగు కోసం అది ఎదురుచూడడం వృధా అవ్వాలి, ఉదయ కిరణాలు దానికి కనపడకూడదు.
10
ఎందుకంటే అది నా కళ్ళ నుండి బాధను దాచిపెట్టడానికి నా తల్లి గర్భద్వారాలను మూయలేదు.
మరణములో విశ్రాంతి కోరిక
11
“పుట్టగానే నేనెందుకు చావలేదు? గర్భం నుండి రాగానే నేనెందుకు మరణించలేదు?
12
నన్నెందుకు మోకాళ్లమీద పడుకోబెట్టుకున్నారు నేనెందుకు తల్లిపాలు త్రాగాను?
13
నేను పుట్టినప్పుడే చనిపోయి ఉంటే; నేను ఈపాటికి నిద్రించి నాకు విశ్రాంతి కలిగియుండేవాన్ని,
14
తమ కోసం భవనాలు కట్టుకున్న భూరాజులతో పాలకులతో,
15
బంగారం సంపాదించుకుని వెండితో తమ ఇళ్ళు నింపుకొన్న అధిపతులతో నేనూ ప్రశాంతంగా నిద్రించి ఉండేవాన్ని.
16
లేదా చనిపోయి పుట్టిన పిండంవలె ఎప్పుడు వెలుగు చూడని శిశువు వలె నేను ఎందుకు నేలలో దాచబడలేదు?
17
అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపెట్టరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు.
18
చెరలో ఉన్నవారు కూడా అక్కడ నెమ్మది అనుభవిస్తారు, యాజమానుల స్వరాలు వారికిక వినబడవు.
19
పేదవారు గొప్పవారు అక్కడ ఉన్నారు, దాసులు తమ యాజమానుల నుండి విముక్తి పొందుతారు.
జీవించుటలో కొనసాగు దుఃఖము
20
“దురవస్థలో ఉన్నవారికి వెలుగెందుకు? ఆత్మలో చేదుననుభవిస్తున్న వారికి జీవమెందుకు?
21
వారు రాని మరణం కోసం ఆశతో ఎదురుచూస్తారు, దాచబడిన ధననిధి కంటే ఎక్కువగా దాని కోసం వెదకుతారు, కాని అది రాదు.
22
వారు సమాధిని చేరినప్పుడు ఆనందంతో నింపబడి సంతోషిస్తారు.
23
మరుగుచేయబడిన మార్గంగలవానికి దేవుడు చుట్టూ కంచెవేసినవానికి జీవం ఎందుకు ఇవ్వబడింది?
24
నిట్టూర్పే నా అనుదిన భోజనంగా మారింది. నా మూలుగులు నీళ్లలా పారుతున్నాయి.
25
దేనికి భయపడ్డానో అదే నా మీదికి వచ్చింది; దేని గురించి దిగులుపడ్డానో అదే నాకు కలిగింది.
26
నాకు నెమ్మది లేదు సుఖం లేదు; విశ్రాంతి లేదు, ఉన్నది ఆందోళన మాత్రమే.”
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Reading Width chars
Options
Study Note