కంటెంట్‌కు వెళ్లండి

1 కొరింథీయులకు5

సంఘంలోని అనైతికతపై తీర్పు

1
మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాము. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట కదా! ఇలాంటి వ్యభిచారం దేవుని ఎరుగనివారు కూడా సహించరు.
2
ఇలా ఉండి కూడా మీరు గర్విస్తున్నారా! నిజానికి ఈ విషయం గురించి మీరు దుఃఖించి ఈ పని చేసిన వానిని మీ సహవాసం నుండి వెలివేయాలి కదా!
3
నా మట్టుకైతే, నేను శారీరకంగా మీతో అక్కడ లేకపోయినా నా ఆత్మలో నేను మీతోనే ఉన్నాను. కాబట్టి మీతో ఉన్న వానిగానే మన ప్రభువైన యేసు నామంలో ఈ పని చేసిన వాని మీద తీర్పు ఇదివరకే తెలియజేశాను.
4
ఎలాగంటే, ప్రభు యేసు నామంలో మీరు సమకూడినప్పుడు ప్రభువైన యేసు శక్తి ద్వారా నేను ఆత్మలో మీతో ఉన్నాను.
5
కాబట్టి ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడేలా వాని శరీరం నశించడానికి వానిని సాతానుకు అప్పగించాలి.

పులిసిన పిండిముద్ద ప్రమాదం

6
మీరు ఆ విషయంలో గర్వించడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమే అయినా మొత్తం పిండిని పులియజేస్తుందని మీకు తెలుసు కదా!
7
క్రీస్తు అనే మన పస్కా గొర్రెపిల్ల మీ కోసం వధించబడి ప్రాయశ్చిత్తం చేశారు కాబట్టి మీరు పులియని క్రొత్త పిండి ముద్దగా ఉండడానికి పులిసిన పాత పిండిని పారవేయండి.
8
కాబట్టి అసూయ, దుర్మార్గం అనే పులిసిన పాత పిండితో కాకుండా నిజాయితీ సత్యమనే పులియని రొట్టెతో పస్కా పండుగ ఆచరిద్దాము.

సామాజిక వేరుపై వివరణ

9
లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాశాను.
10
అయితే నేను, ఈ లోకపు వ్యభిచారులతో గాని, అత్యాశపరులతో గాని, మోసం చేసేవారితో గాని, విగ్రహారాధికులతో గాని ఏమాత్రం కలిసి ఉండవద్దని చెప్పడం లేదు, అలాగైతే మీరు లోకాన్నే విడిచి వెళ్లవలసి ఉంటుంది కదా!
11
ఇప్పుడైతే, సహోదరి అని సహోదరుడని పిలువబడే సంఘసభ్యుల గురించి వ్రాస్తున్నాను. ఎవరైనా వ్యభిచారిగా, అత్యాశపరునిగా, విగ్రహారాధికునిగా లేదా నిందలువేసే వారిగా, త్రాగుబోతుగా లేదా మోసగానిగా ఉంటే అలాంటి వారితో కలిసి ఉండవద్దు. అలాంటి వారితో భోజనం కూడా చేయవద్దని మీకు వ్రాస్తున్నాను.
12
సంఘానికి బయట ఉన్నవారిని విమర్శించడం నాకెందుకు? మీకు సంఘసభ్యులను తీర్చు తీర్చే బాధ్యత లేదా?
13
సంఘం బయటివారికి దేవుడే తీర్పు తీరుస్తారు. కాబట్టి వాక్యంలో ఉన్నట్లు, “ఆ దుష్టున్ని మీ మధ్య నుండి వెలివేయండి.”
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options