కీర్తనలు 119:93-117
93
నేను మీ కట్టడలు ఎన్నడు మరువను, ఎందుకంటే వాటి ద్వార మీరు నా జీవితాన్ని కాపాడారు.
94
నేను మీ వాడను, నన్ను రక్షించండి; నేను మీ కట్టడలను వెదికాను.
95
దుష్టులు నన్ను చంపాలని కాచుకుని ఉన్నారు, కాని నేనైతే మీ శాసనాలను గురించి ఆలోచిస్తాను.
96
సంపూర్ణతకు కూడా ఉంది పరిమితి! కానీ, మీ ధర్మశాస్త్రోపదేశం అపరిమితము.
97
ఓ, మీ ధర్మశాస్త్రం అంటే నాకెంత ఇష్టమో! నేను రోజంతా దానిని ధ్యానిస్తాను.
98
మీ ఆజ్ఞలు ఎల్లప్పుడు నాతో ఉండి నా శత్రువుల కన్నా నన్ను జ్ఞానిగా చేస్తాయి.
99
నేను మీ శాసనాలను ధ్యానిస్తాను కాబట్టి నా ఉపదేశకులందరి కంటే నేను ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్నాను.
100
నేను మీ కట్టడలను ఆచరిస్తాను కాబట్టి వృద్ధులకు మించిన గ్రహింపు నేను కలిగి ఉన్నాను.
101
మీ వాక్యం చెప్పినట్లే చేద్దామని చెడు మార్గాల నుండి నా పాదాలు తొలగించుకున్నాను.
102
నేను మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు, ఎందుకంటే మీరే నాకు బోధించారు.
103
మీ వాక్కులు నా నోటికి ఎంతో మధురం, అవి తేనెకంటె తియ్యనివి!
104
మీ కట్టడల వల్ల నేను గ్రహింపు పొందాను; కాబట్టి తప్పుడు త్రోవలంటే నాకు అసహ్యము.
105
మీ వాక్కు నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు.
106
నేను మీ నీతిగల న్యాయవిధులను పాటిస్తానని ప్రమాణం చేసి ధృవీకరించాను.
107
యెహోవా, నేను చాలా బాధపడ్డాను; మీ వాక్కు ప్రకారం నా జీవితాన్ని కాపాడండి.
108
యెహోవా, నా నోటి యొక్క ఇష్టపూర్వకమైన స్తుతిని స్వీకరించండి, మీ న్యాయవిధులు నాకు బోధించండి.
109
నేను నిరంతరం నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పటికీ, నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవను.
110
దుష్టులు నన్ను చిక్కించుకోవాలని ఉరులు ఒడ్డారు, అయినా నేను మాత్రం మీ కట్టడల నుండి తొలగిపోలేదు.
111
మీ శాసనాలు నాకు శాశ్వత వారసత్వం; అవి నా హృదయానికి ఆనందం.
112
అంతం వరకు మీ శాసనాలను పాటించాలని నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను.
113
ద్విమనస్కులంటే నాకు అసహ్యం, కాని మీ ధర్మశాస్త్రం నాకు ఇష్టం.
114
మీరు నా ఆశ్రయం నా డాలు; నేను మీ మాటలో నిరీక్షణ ఉంచాను.
115
నేను నా దేవుని ఆజ్ఞలను పాటించేలా, కీడుచేసేవారలారా, నాకు దూరంగా ఉండండి!
116
మీ వాగ్దానం ప్రకారం నన్నాదుకోండి, నేను బ్రతుకుతాను; నా నిరీక్షణను బద్దలు కానివ్వకండి.
117
నన్ను ఎత్తిపట్టుకోండి, నేను విడిపించబడతాను; మీ శాసనాలను నేను ఎల్లప్పుడు గౌరవిస్తాను.
Settings