సామెతలు 6:19-35
19
అబద్ధాలు చెప్పే అబద్ధసాక్షి, సమాజంలో గొడవ రేపే వ్యక్తి.
20
నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు పాటించు నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకు.
21
వాటిని ఎప్పుడు నీ హృదయంలో పదిలంగా ఉంచుకో; నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో.
22
నీవు త్రోవను నడిచేటప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి; నీవు నిద్రించేటప్పుడు అవి నిన్ను కాపాడతాయి. నీవు మేలుకొనునప్పుడు అవి నీతో మాట్లాడతాయి.
23
ఈ ఆజ్ఞ దీపంగా ఈ బోధ వెలుగుగా క్రమశిక్షణ కోసమైన దిద్దుబాట్లుగా జీవమార్గాలుగా ఉండి,
24
వ్యభిచార స్త్రీ దగ్గరకు వెళ్లకుండ దారితప్పిన స్త్రీ పలికే మాటలకు లొంగిపోకుండ నిన్ను కాపాడతాయి.
25
నీ హృదయంలో ఆమె అందాన్ని మోహించకు తన కళ్లతో నిన్ను వశపరచుకోనియ్యకు.
26
ఎందుకంటే ఒక వేశ్యను రొట్టె ముక్కకైనా పొందవచ్చు, కానీ మరొకని భార్య నీ జీవితాన్నే వేటాడుతుంది.
27
ఒక మనుష్యుడు తన బట్టలు కాలకుండ తన ఒడిలో అగ్నిని ఉంచుకోగలడా?
28
తన పాదాలు కాలకుండ ఎవరైనా నిప్పుల మీద నడవగలరా?
29
మరొకని భార్యతో పడుకునే వాడు కూడా అంతే; ఆమెను తాకేవాడు శిక్షను తప్పించుకోలేడు.
30
ఆకలితో అలమటిస్తూ ఉండి ఆకలి తీర్చుకోవడానికి దొంగ దొంగతనం చేస్తే ప్రజలు వాన్ని చులకనగా చూడరు.
31
అయినాసరే వాడు దొరికితే, వాడు ఏడంతలు చెల్లించాలి, దానికి తన ఇంటి సంపదంతా ఖర్చైనా సరే.
32
అయితే వ్యభిచారం చేసే ఒక మనిషికి బుద్ధిలేదు; అలా ఎవరు చేసినా వారు తమను తామే నాశనం చేసుకుంటారు.
33
దెబ్బలు, అవమానం వాని భాగం, వానికి కలిగే అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు.
34
ఎందుకంటే అనుమానం భర్తకు రోషాన్ని పుట్టిస్తుంది, ప్రతీకారం తీర్చుకునేటప్పుడు అతడు కనికరం చూపించడు.
35
అతడు ఏ పరిహారాన్ని అంగీకరించడు; ఎంత ఎక్కువైనా సరే, అతడు లంచాన్ని తిరస్కరిస్తాడు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings