సంఖ్యాకాండము 4:15-39
15
“అహరోను అతని కుమారులు పరిశుద్ధ సామాగ్రి, పరిశుద్ధ ఉపకరణాలన్నిటిని కప్పడం పూర్తి చేసిన తర్వాత, ప్రజలు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కహాతీయులు వచ్చి దానిని మోయాలి. అయితే వారు పరిశుద్ధమైన వాటిని ముట్టకూడదు, ముట్టుకుంటే వారు చస్తారు. కహాతీయులు సమావేశ గుడారంలో ఉన్నవాటిని మోయాలి.
16
“అహరోను కుమారుడును యాజకుడునైన ఎలియాజరు, దీపానికి నూనె, పరిమళ వాసనగల ధూపద్రవ్యం, నిత్యం అర్పించే భోజనార్పణ, అభిషేక తైలం మొదలగువాటిని పర్యవేక్షిస్తాడు. అతడు సమావేశ గుడారమంతటిని, అందులో ఉన్న సామాగ్రిని, పరిశుద్ధ ఉపకరణాలతో పాటు ప్రతిదీ పర్యవేక్షిస్తాడు.”
17
యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు,
18
“లేవీయుల మధ్య నుండి కహాతీయుల వంశం నాశనమై పోకుండా చూడండి.
19
వారు అతిపరిశుద్ధమైన వాటి దగ్గరకు వచ్చినప్పుడు చావకుండ బ్రతికి ఉండేలా మీరు వారి కోసం ఇలా చేయండి: అహరోను అతని కుమారులు పరిశుద్ధాలయంలోకి వెళ్లి, వారందరికి వారు చేయాల్సిన పనిని, వారు మోయాల్సిన వాటిని వారికి అప్పగించాలి.
20
అయితే కహాతీయులు పరిశుద్ధమైన వాటిని చూడాలని, కనీసం ఒక్క క్షణమైనా లోనికి వెళ్లకూడదు, వెళ్తే వారు చస్తారు.”
21
యెహోవా మోషేతో ఇలా అన్నారు,
22
“గెర్షోనీయులను కూడా వారి కుటుంబాలు, వంశాల ప్రకారం జనాభా లెక్కలు తీసుకోండి.
23
సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సుగల పురుషులందరినీ లెక్కించండి.
24
“మోయడంలో, అలాగే వారి ఇతర పనులలో గెర్షోను వంశస్థుల సేవ ఇదే:
25
ప్రత్యక్ష గుడారం యొక్క తెరలు అంటే సమావేశ గుడారం దాని కప్పు అలాగే మన్నికైన తోలుతో చేయబడిన వెలుపటి కప్పు ఇంకా సమావేశ గుడార ద్వారం యొక్క తెరలు,
26
సమావేశ గుడారం, బలిపీఠం చుట్టూ ఉన్న ఆవరణ తెరలు, ఆవరణ ప్రవేశ ద్వారపు తెరలు, వాటి త్రాళ్లు గుడారంలో సేవకు ఉపయోగించే వస్తువులన్నిటిని మోయాలి. వీటితో చేయాల్సిన పనులన్నీ గెర్షోనీయులు చేయాలి.
27
గెర్షోనీయులు మోసుకెళ్లే పనైనా లేదా వేరే పనైనా వారి సేవ అంతా అహరోను అతని కుమారుల ఆధ్వర్యంలోనే జరగాలి. వారు మోయాల్సిన బాధ్యతను మీరు వారికి అప్పగించాలి.
28
సమావేశ గుడారం దగ్గర గెర్షోను వంశస్థులు చేయాల్సిన సేవ ఇదే. వారి విధులను అహరోను కుమారుడును యాజకుడునైన ఈతామారు పర్యవేక్షణలో జరగాలి.
29
“మెరారీయుల కుటుంబాలను వారి వంశాల ప్రకారం జనాభా లెక్క తీసుకోండి.
30
సమావేశ గుడారంలో పని చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల వయస్సుగల పురుషులందరినీ లెక్కించండి.
31
గుడారంలో వారి సేవలో భాగంగా వారు గుడారపు పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు,
32
అంతేకాక, ఆవరణం చుట్టూ ఉండే స్తంభాలు వాటి దిమ్మలు, మేకులు, త్రాళ్లు వాటికి సంబంధించినవన్నీ వారే మోయాలి. ప్రతి ఒక్కరు మోయడానికి నిర్దిష్టమైన వాటిని అప్పగించండి.
33
సమావేశ గుడారం దగ్గర అహరోను కుమారుడు, యాజకుడైన ఈతామారు పర్యవేక్షణలో మెరారి వంశస్థులు చేసే సేవ ఇది.”
34
మోషే, అహరోనులు సమాజ నాయకులతో కలిసి కహాతీయులను వారి వంశాలు, వారి కుటుంబాల ప్రకారం లెక్కించారు.
35
వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సు కలిగి సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చిన పురుషులంతా 2,750 మంది.
37
సమావేశ గుడారం దగ్గర సేవచేసే కహాతు వంశాల మొత్తం లెక్క ఇది. యెహోవా మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనులు వారిని లెక్కించారు.
38
గెర్షోనీయులు వారి వంశాలు, కుటుంబాల ప్రకారం లెక్కించబడ్డారు.
39
వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సు కలిగి, సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చిన పురుషులందరు 2,630 మంది.
Settings