Skip to content
మత్తయి 22:1-14

మత్తయి 22:1-14

1
యేసు మరలా ఉపమానరీతిలో వారితో మాట్లాడుతూ,
2
“పరలోక రాజ్యం ఒక రాజు తన కుమారుని కోసం ఏర్పాటుచేసిన గొప్ప పెండ్లి విందును పోలి ఉంది.
3
ఆ పెండ్లివిందుకు పిలువబడినవారిని రమ్మని పిలువడానికి అతడు తన పనివారిని పంపించాడు, కాని వారు రావడానికి తిరస్కరించారు.
4
“కాబట్టి ఆయన ఆహ్వానించిన వారి దగ్గరకు మరికొందరు పనివారిని పంపించి, ‘ఇదిగో, నేను విందు సిద్ధపరిచాను: నా ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడ్డాయి, అంతా సిద్ధంగా ఉంది. పెండ్లివిందుకు రండి’ అని చెప్పమన్నాడు.
5
“కానీ వారు అతని మాటలు లెక్కచేయకుండా ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్లిపోయారు.
6
మిగిలిన వారు ఆ పిలుపును తెచ్చిన పనివారిని పట్టుకుని, అవమానించి వారిని చంపారు.
7
కాబట్టి రాజు కోప్పడి తన సైన్యాన్ని పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు.
8
“అప్పుడు అతడు తన పనివారితో, ‘పెండ్లి విందు సిద్ధంగా ఉంది, గాని నేను పిలిచిన వారు యోగ్యులు కారు.
9
కాబట్టి మీరు వీధి మూలలకు పోయి మీకు కనబడిన వారినందరిని పెండ్లివిందుకు ఆహ్వానించండి’ అని తన పనివారితో చెప్పాడు.
10
ఆ పనివారు వీధులలోనికి పోయి తమకు కనబడిన చెడ్డవారిని, మంచివారిని అందరిని పోగుచేశారు, కాబట్టి ఆ పెండ్లి వేదిక అంతా విందుకు వచ్చిన అతిథులతో నిండిపోయింది.
11
“కాని ఆ రాజు అతిథులను చూడడానికి లోపలికి వచ్చినప్పుడు, అక్కడ పెండ్లి వస్త్రాలను వేసుకోకుండా కూర్చున్న ఒకడు అతనికి కనిపించాడు.
12
రాజు వానితో, ‘స్నేహితుడా, పెండ్లి వస్త్రాలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. వాడు మౌనంగా ఉండిపోయాడు.
13
“అప్పుడు ఆ రాజు తన పనివారితో, ‘వీని చేతులు కాళ్లు కట్టి, బయట చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి’ అని చెప్పారు.
14
“అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఏర్పరచబడ్డారు.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options