Skip to content
మార్కు 6:38-56

మార్కు 6:38-56

38
అందుకు ఆయన, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్లి చూడండి” అని అడిగారు. వారు వెళ్లి చూసి, “అయిదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అన్నారు.
39
అప్పుడు ఆయన వారందరిని గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోపెట్టమని శిష్యులతో చెప్పారు.
40
వారు వంద యాభైల చొప్పున గుంపులుగా కూర్చున్నారు.
41
అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి ఆ రొట్టెలను విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. ఆయన ఆ రెండు చేపలను కూడా వారందరికి విభజించారు.
42
వారందరు తిని తృప్తి పొందారు.
43
తర్వాత శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.
44
తిన్న వారి సంఖ్య అయిదు వేలమంది పురుషులు.
45
వెంటనే యేసు జనసమూహాన్ని పంపివేస్తూ తన శిష్యులు తనకన్న ముందుగా బేత్సయిదా గ్రామానికి వెళ్లేలా వారిని పడవ ఎక్కించారు.
46
వారిని పంపివేసిన తర్వాత, ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు.
47
ఆ రాత్రి సమయాన, ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది, ఆయన ఒంటరిగా నేలపైన ఉన్నారు.
48
ఎదురుగాలి వీస్తుండడంతో, శిష్యులు పడవను చాలా కష్టపడుతూ నడపడం యేసు చూశారు. రాత్రి నాల్గవ జామున ఆయన సరస్సు మీద నడుస్తూ, వారి దగ్గరకు వెళ్లారు.
49
కాని ఆయన నీళ్ల మీద నడవటం వారు చూసినప్పుడు, భూతం అనుకుని వారు కేకలు వేశారు,
50
ఎందుకంటే వారందరు ఆయనను చూసి భయపడ్డారు. వెంటనే ఆయన వారితో, “ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి!” అన్నారు.
51
అప్పుడు ఆయన వారితో పడవలోనికి ఎక్కారు, అప్పుడు గాలి అణగిపోయింది. వారు ఎంతో ఆశ్చర్యపడ్డారు.
52
రొట్టెల అద్భుతం యొక్క ప్రాముఖ్యతను వారు ఇంకా అర్థం చేసుకోలేదు; వారి హృదయాలు కఠినమయ్యాయి.
53
వారు అవతలకు వెళ్లి, గెన్నేసరెతు అనే ప్రాంతంలో దిగారు, అక్కడ లంగరు వేశారు.
54
వారు పడవ దిగగానే, ప్రజలు యేసును గుర్తుపట్టారు.
55
వారు ఆ ప్రాంతమంతా పరుగెత్తుకొనిపోయి, ఆయన ఎక్కడ ఉన్నాడని విన్నారో అక్కడికి రోగులను పరుపుల మీద మోసుకొచ్చారు.
56
యేసు గ్రామాలకు, పట్టణాలకు, పల్లెటూళ్ళకు, ఎక్కడికి వెళ్లినా వారు రోగులను తెచ్చి సంత వీధుల్లో ఉంచారు. ఆయన వస్త్రపు అంచునైనా ముట్టనివ్వండని వారు ఆయనను బ్రతిమాలారు. ఆయనను ముట్టిన వారందరు స్వస్థత పొందారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options