మార్కు 15:28-39
28
ఆయన అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు అని వ్రాయబడినది.
29
ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు నీవే కదా!
30
సిలువ మీద నుండి దిగిరా, నిన్ను నీవే రక్షించుకో!” అని అంటూ దూషించారు.
31
అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనను ఎగతాళి చేశారు, “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు.
32
ఈ క్రీస్తు, ఇశ్రాయేలీయుల రాజు, మేము చూసి నమ్మేలా ఇప్పుడు సిలువ నుండి దిగిరా” అని ఆయనను హేళన చేశారు. ఆయనతో కూడా సిలువవేయబడిన వారు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు.
33
మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది.
34
మూడు గంటలకు యేసు, “ఎలోయి, ఎలోయి, లామా సబక్తానీ” అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటలకు, “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థము.
35
దగ్గర నిలబడిన వారిలో కొందరు ఆ మాటలను విని, “వినండి, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.
36
ఒకడు పరుగెత్తుకొని వెళ్లి, ఒక స్పంజీని పుల్లని ద్రాక్షరసంలో ముంచి ఒక కర్రకు తగిలించి, యేసుకు త్రాగడానికి అందించాడు. “ఇప్పుడు వీన్ని ఒంటరిగా వదిలి వేద్దాము. ఏలీయా వచ్చి వీన్ని క్రిందికి దించుతాడేమో చూద్దాం” అన్నాడు.
37
గొప్ప కేక వేసి, యేసు ప్రాణం విడిచారు.
38
అప్పుడు దేవాలయంలో తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది.
39
యేసుకు ఎదురుగా నిలబడి ఉన్న శతాధిపతి, ఆయన ప్రాణం విడవడం చూసి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అన్నాడు.
Settings