లూకా 6:17-49
17
ఆయన కొండ దిగి వారితో పాటు మైదానంలో నిలబడ్డారు. అక్కడ ఆయన శిష్యుల యొక్క గొప్ప జనసమూహం ఉంది, యూదయ అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను చుట్టూ ఉన్న తీరప్రాంతం నుండి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
18
వారు ఆయన చెప్పే బోధను వినడానికి తమ వ్యాధుల నుండి స్వస్థత పొందడానికి వచ్చారు. అపవిత్రాత్మలు పీడిస్తున్న వారు కూడా బాగుపడ్డారు,
19
ప్రజలందరూ ఆయనను ముట్టుకోవాలని ప్రయత్నించారు ఎందుకంటే, ఆయనలో నుండి ప్రభావం బయలుదేరి వారందరిని స్వస్థపరుస్తున్నది.
20
తన శిష్యులవైపు చూస్తూ, ఆయన ఇలా బోధించారు: “దీనులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే.
21
ఇప్పుడు ఆకలిగొనిన మీరు ధన్యులు, మీరు తృప్తిపొందుతారు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు.
22
మనుష్యకుమారుని నిమిత్తం ప్రజలు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, మిమ్మల్ని అవమానించి, మీరు చెడ్డవారని మీ పేరును తృణీకరించినప్పుడు మీరు ధన్యులు.
23
“ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది. ఎందుకంటే వారి పితరులు కూడా ప్రవక్తలను ఇలాగే హింసించారు.
24
“కాని ధనవంతులారా మీకు శ్రమ, మీ ఆదరణను మీరు ఇప్పటికే పొందుకున్నారు.
25
ఇప్పుడు కడుపు నింపుకొన్న వారలారా మీకు శ్రమ, మీరు ఆకలిగొంటారు. ఇప్పుడు నవ్వుతున్న వారలారా మీకు శ్రమ, మీరు దుఃఖించి రోదిస్తారు.
26
మనుష్యులందరు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ, వారి పూర్వికులు అబద్ధ ప్రవక్తలకు అలాగే చేశారు.
27
“అయితే వింటున్న మీతో నేను చెప్పేది ఏంటంటే: మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి,
28
మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి.
29
ఎవరైనా మిమ్మల్ని చెంపమీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి. ఎవరైనా మీ పైవస్త్రాన్ని తీసుకుంటే, వారికి మీ అంగీని కూడా ఇవ్వండి.
30
మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా నీకు చెందిన దానిని తీసుకుంటే, దాన్ని మళ్ళీ అడగవద్దు.
31
ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి.
32
“ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీకు ఏం లాభం? పాపులు కూడా తమను ప్రేమించేవారినే ప్రేమిస్తారు.
33
ఒకవేళ మీరు మీకు మేలు చేసే వారికే మేలు చేస్తే, మీకేమి లాభం? పాపులు కూడ అలాగే చేస్తారు కదా!
34
మీకు తిరిగి ఇవ్వగలిగిన వారికే మీరు ఇస్తే మీకేమి లాభం? మీరు కూడా తాము ఇచ్చింది తమకు పూర్తిగా తిరిగి వస్తుందని పాపులకే ఇస్తారు.
35
మీరైతే మీ శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి, తిరిగి ఏమి ఆశించకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ ప్రతిఫలం గొప్పగా ఉంటుంది, మీరు సర్వోన్నతుని పిల్లలుగా ఉంటారు, ఎందుకంటే ఆయన కృతజ్ఞతలేనివారికి, దుష్టులకు కూడా దయ చూపించేవాడు.
36
మీ తండ్రి కనికరం కలవాడై ఉన్నట్లు, మీరు కూడ కనికరం కలవారై ఉండండి.
37
“తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు. ఖండించకండి, మీరు ఖండించబడరు. క్షమించండి, మీరు క్షమించబడతారు.
38
ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. అణచి, కుదిపి, పొర్లిపారునట్లు నిండు కొలత మీ ఒడిలో పోయబడుతుంది. ఎందుకంటే, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత కొలవబడుతుంది.”
39
యేసు వారికి ఈ ఉపమానాన్ని కూడా చెప్పారు, “గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపించగలడా? వారిద్దరు గుంటలో పడరా?
40
ఒక శిష్యుడు బోధకుని కంటే ఉన్నతుడు కాడు, అయితే పూర్తిగా శిక్షణ పొందుకొన్నవాడు తన బోధకునిలా అవుతాడు.
41
“నీ కంటిలో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తావు?
42
నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోవడం విఫలమైన నీవు నీ సహోదరునితో, ‘సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీయనివ్వు’ అని నీవెలా అనగలవు? ఓ వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయు, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది.
43
“ఏ మంచి చెట్టు చెడ్డపండ్లు కాయదు, ఏ చెడ్డ చెట్టు మంచి పండ్లు కాయదు.
44
ప్రతి చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది. ప్రజలు ముళ్ళపొదల్లో అంజూర పండ్లను, లేదా గచ్చ పొదల్లో ద్రాక్షపండ్లను కోయరు.
45
మంచివారు తమ మంచి హృదయ ధననిధిలో నుండి మంచివాటినే బయటకు తీస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయ నిధిలో నుండి చెడ్డవాటినే బయటకు తీస్తారు. ఎందుకంటే, హృదయం దేనితో నిండి ఉందో దానినే నోరు మాట్లాడుతుంది.
46
“నేను చెప్పే మాట ప్రకారం చేయకుండా ఎందుకు నన్ను ‘ప్రభువా, ప్రభువా’ అని పిలుస్తున్నారు?
47
నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేసేవారు ఎలాంటివారో నేను మీకు చెప్తాను.
48
లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి, ఇల్లు కట్టిన వ్యక్తిలా ఉంటారు. వరదలు వచ్చి ప్రవాహాలు వేగంగా ఆ ఇంటిని తాకాయి కాని ఆ ఇంటిని ఏమి చేయలేకపోయాయి, ఎందుకంటే ఆ వ్యక్తి ఆ ఇంటిని బలమైన పునాది మీద కట్టుకున్నాడు.
49
అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాని లాంటివారు. వరద ప్రవాహం వేగంగా ఆ ఇంటిని తాకగానే, అది కూలి పూర్తిగా ధ్వంసం అయ్యింది.”
Settings