లూకా 14:17-35
17
విందు సమయంలో విందుకు పిలువబడినవారిని, ‘రండి, విందు సిద్ధంగా ఉంది’ అని చెప్పడానికి అతడు తన సేవకులను పంపించాడు.
18
“కానీ వారందరు ఒకేలా సాకులు చెప్పడం మొదలుపెట్టారు. మొదటివాడు, ‘నేను ఇప్పుడే ఒక పొలం కొన్నాను కాబట్టి దానిని చూడడానికి తప్పక వెళ్లాలి, దయచేసి నన్ను క్షమించండి’ అన్నాడు.
19
“మరొకడు, ‘నేనిప్పుడే అయిదు జతల ఎడ్లను కొన్నాను, ఇప్పుడు వాటిని చూడడానికి వెళ్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి’ అన్నాడు.
20
“మరొకడు, ‘నేను ఇప్పుడే పెళ్ళి చేసుకున్నాను, కాబట్టి నేను రాలేనని’ చెప్పి పంపాడు.
21
“ఆ సేవకుడు తిరిగివచ్చి, తన యజమానికి వారి మాటలను తెలియజేశాడు. ఆ యజమాని ఆ మాటలను విని కోప్పడి ఆ సేవకునితో, ‘నీవు వెంటనే వెళ్లి పట్టణ వీధుల్లో, సందుల్లో ఉన్న బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని తీసుకురా’ అని ఆదేశించాడు.
22
“ఆ సేవకుడు తన యజమానితో, ‘అయ్యా, నీవు చెప్పినట్లే చేశాను, అయినా ఇంకా చాలా ఖాళీ స్థలం ఉంది’ అన్నాడు.
23
“అందుకు ఆ యజమాని తన సేవకునితో, ‘నా ఇంటిని నింపడానికి వీధుల్లో సందులలోన కనిపించిన వారందరిని లోపలికి రమ్మని బలవంతం చేయి.
24
ఆహ్వానించబడిన వారిలో ఒక్కడు కూడ నేను ఏర్పచిన విందును రుచి చూడడని మీతో చెప్తున్నాను’ అని అన్నారు.”
25
పెద్ద జనసమూహాలు యేసుతో కూడా వెళ్తుండగా, ఆయన వారివైపు తిరిగి అన్నారు:
26
“ఎవరైనా, నా శిష్యునిగా ఉండాలనుకుంటే తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, సహోదర సహోదరీలను, చివరికి తన ప్రాణాన్ని సైతం, వదులుకోడానికి సిద్ధంగా లేకపోతే, నా శిష్యులు కాలేరు.
27
తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు శిష్యులు కాలేరు.
28
“ఉదాహరణకు మీలో ఎవరైనా ఒక గోపురం కట్టించాలని అనుకుంటే దాన్ని పూర్తి చేయడానికి సరిపడే డబ్బు మీ దగ్గర ఉందా లేదా అని ముందుగా చూసుకోరా?
29
ఎందుకంటే ఒకవేళ మీరు పునాది వేసి, దాన్ని పూర్తి చేయలేకపోతే, చూసే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని,
30
‘వీడు కట్టడం మొదలుపెట్టాడు కాని ముగించలేకపోయాడు’ అంటూ ఎగతాళి చేస్తారు.
31
“ఒక రాజు మరొక రాజుపై యుద్ధం చేయబోయేటప్పుడు, ఇరవై వేలమంది సైన్యంతో తన మీదికి వస్తున్న వాన్ని పదివేలమంది సైన్యంతో ఎదిరించగలనా అని అతడు ముందుగానే కూర్చుని ఆలోచించడా?
32
ఒకవేళ అతనికి అది అసాధ్యం అనిపిస్తే, శత్రువు ఇంకా దూరంలో ఉండగానే శాంతి నిబంధనలను చర్చించడానికి అతడు ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతాడు.
33
అదే విధంగా, మీరు కూడా మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని వదులుకోనట్లైతే నా శిష్యులు కాలేరు.
34
“ఉప్పు మంచిదే, కాని ఒకవేళ అది తన సారం కోల్పోతే, అది తిరిగి సారవంతం ఎలా చేయబడుతుంది?
35
అది నేలకు గాని ఎరువు కుప్పకు గాని పనికిరాదు; అది బయట పారవేయబడుతుంది. “వినడానికి చెవులుగలవారు విందురు గాక!”
Settings