న్యాయాధిపతులు 7:16-25
16
ఆ మూడువందల మందిని మూడు గుంపులుగా చేసి, వారందరి చేతుల్లో బూరను ఖాళీ కుండను, ప్రతి కుండలో దివిటీని పెట్టి ఇచ్చాడు.
17
గిద్యోను వారితో, “నన్ను గమనించి వెంబడించండి, నేను దండును సమీపించినప్పుడు నేను చేసినట్లే మీరూ చేయండి.
18
నేను, నాతో ఉన్నవారందరు మా బూరలు ఊదినప్పుడు, దండు చుట్టూ ఉన్న మీరు మీ బూరలు ఊదుతూ, ‘యెహోవా కోసం, గిద్యోను కోసం’ అంటూ కేకలు వేయండి.”
19
నడి జాము వేళ మొదటి జాము కావలివారు మారే సమయంలో గిద్యోను, అతనితో ఉన్న వందమంది దండును సమీపించారు. వారు బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగులగొట్టారు.
20
ఆ మూడు గుంపులవారు కూడా తమ బూరలను ఊది కుండలను పగులగొట్టారు. వారి ఎడమ చేతుల్లో దివిటీలను, కుడి చేతుల్లో బూరలను పట్టుకుని, “యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం!” అని కేకలు వేశారు.
21
దండు చుట్టూ ప్రతి మనుష్యుడు తన స్థానంలో ఉండగా మిద్యాను సైన్యం కేకలువేస్తూ పారిపోయింది.
22
మూడువందలమంది బూరలు ఊదినప్పుడు, యెహోవా ఆ దండులోని వారందరు తమ ఖడ్గాలతో ఒకరినొకరు చంపుకొనేలా చేశారు. ఆ సైన్యం సెరేరా వైపు ఉన్న బేత్-షిత్తాకు, తబ్బాతు దగ్గరున్న ఆబేల్-మెహోలా సరిహద్దు వరకు పారిపోయారు.
23
నఫ్తాలి, ఆషేరు, మనష్షే గోత్రాల నుండి పిలువబడిన ఇశ్రాయేలీయులు వచ్చి మిద్యానీయులను తరిమారు.
24
గిద్యోను ఎఫ్రాయిం కొండసీమ దేశమంతటికి దూతలను పంపి, “క్రిందికి రండి, మిద్యానీయులను జయించడానికి వచ్చి బేత్-బారా వరకు యొర్దాను నీళ్లను వారికి ముందున్న స్వాధీనపరచుకోండి” అని చెప్పాడు. కాబట్టి ఎఫ్రాయిం గోత్రికులందరు వచ్చి యొర్దాను నీళ్లను బేత్-బారా వరకు స్వాధీనపరచుకున్నారు.
25
వారు మిద్యాను నాయకుల్లో ఓరేబు, జెయేబు అనే ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబును చంపారు, జెయేబు ద్రాక్షతోట దగ్గర జెయేబును చంపారు. వారు మిద్యానీయులను వెంటాడి, యొర్దాను అవతల ఉన్న గిద్యోను దగ్గరకు ఓరేబు, జెయేబు తలలను తెచ్చారు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings