న్యాయాధిపతులు 18:14-26
14
అప్పుడు లాయిషు ప్రాంతానికి వేగులవారిగా వెళ్లిన ఆ అయిదుగురు తమ తోటి దానీయులతో, “ఈ ఇళ్ళలో ఒక ఇంట్లో ఏఫోదు, కొన్ని గృహదేవతలు, వెండితో పొదిగించిన విగ్రహం ఉన్నాయని మీకు తెలుసా? ఇప్పుడు ఏమి చేయాలో ఆలోచించండి” అన్నారు.
15
కాబట్టి వారు తిరిగి ఆ లేవీ యువకుడు నివసిస్తున్న మీకా ఇంటికి వెళ్లి, అతన్ని క్షేమసమాచారం అడిగారు.
16
ద్వారం దగ్గర యుద్ధాయుధాలు ధరించిన ఆరువందలమంది దానీయులు నిలబడ్డారు.
17
యాజకుడు, యుద్ధాయుధాలు ధరించిన ఆరువందలమంది ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, దేశాన్ని పరిశోధించడానికి వెళ్లిన ఆ అయిదుగురు మనుష్యులు లోనికి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును గృహదేవతలను తీసుకున్నారు.
18
ఆ అయిదుగురు మీకా ఇంట్లోకి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును, గృహదేవతలను తీసుకున్నప్పుడు, ఆ యాజకుడు, “మీరు ఏం చేస్తున్నారు?” అని వారిని అడిగాడు.
19
వారు అతనితో, “నోరు మూసుకో! ఒక్క మాట మాట్లాడకుండ మాతో వచ్చి మాకు తండ్రిగా యాజకునిగా ఉండు. ఒక మనిషి కుటుంబానికి మాత్రమే యాజకునిగా ఉండడం కంటే ఇశ్రాయేలులో ఒక గోత్రమంతటికి, కుటుంబానికి యాజకునిగా ఉండడం మంచిది కాదా?” అన్నారు.
20
యాజకుడు చాలా సంతోషించాడు. అతడు ఏఫోదును, గృహదేవతలను, విగ్రహాన్ని తీసుకుని ఆ ప్రజలతో వెళ్లాడు.
21
వారు తమ చిన్న పిల్లలను, పశువులను, ఆస్తులను ముందుగా పెట్టుకొని అక్కడినుండి బయలుదేరారు.
22
వారు మీకా ఇంటి నుండి కొంత దూరం వెళ్లాక, మీకా పొరుగువారు సమకూడి దానీయుల వెంటపడ్డారు.
23
వారు కేకలు వేస్తుండగా, దానీయులు తిరిగి మీకాను, “నీ మనుష్యులను పోరాడడానికి పిలిచావు, నీకేమి కావాలి?” అని అడిగారు.
24
మీకా జవాబిస్తూ, “నేను చేసిన దేవుళ్ళను, నా యాజకుని మీరు తీసుకెళ్లారు. ఇక నా దగ్గర ఏముంది? ‘ఏంటి విషయం?’ అని నన్ను అడుగుతారేంటి?” అన్నాడు.
25
దానీయులు అతనితో అన్నారు, “మాతో వాదించకు; కోపంతో మా మనుష్యుల్లో కొందరు నీపై దాడి చేసి నిన్ను నీ కుటుంబాన్ని చంపుతారు.”
26
కాబట్టి దానీయులు తమ దారిన తాము వెళ్లిపోయారు. వారు అతనికంటే బలంగా ఉన్నారని గ్రహించి, మీకా తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు.
Settings