Skip to content
యిర్మీయా 46:13-26

నెబుకద్నెజరు ఐగుప్తుపై దండయాత్ర ప్రవచనం

యిర్మీయా 46:13-26
13
ఈజిప్టుపై దాడి చేయడానికి బబులోను రాజైన నెబుకద్నెజరు రావడం గురించి యెహోవా యిర్మీయా ప్రవక్తతో చెప్పిన సందేశం ఇది:
14
“ఈజిప్టులో ప్రకటన చేయండి, మిగ్దోలులో చాటించండి; మెంఫిసులో, తహ్పన్హేసులో కూడా చాటించండి: ‘ఖడ్గం నీ చుట్టూ ఉన్నవారందరిని హతమారుస్తుంది, కాబట్టి మీరు మీ స్థానాల్లో సిద్ధంగా ఉండండి.’
15
నీ బలవంతులు ఎందుకు దిగజారిపోతారు? వారు నిలబడలేరు, ఎందుకంటే యెహోవా వారిని క్రిందికి నెట్టివేస్తారు.
16
వారు పదే పదే తడబడతారు; వారు ఒకరి మీద ఒకరు పడతారు. వారు, ‘లేవండి, మనం అణచివేసే వారి ఖడ్గానికి దూరంగా, మన స్వదేశాలకు, మన సొంత ప్రజల దగ్గరికి తిరిగి వెళ్దాం’ అని చెప్తారు.
17
అక్కడ వారు, ‘ఈజిప్టు రాజు ఫరో పెద్ద శబ్దం మాత్రమే; అతడు తన అవకాశాన్ని కోల్పోయాడు’ అని గట్టిగా కేకలు వేస్తారు.
18
“నా జీవం తోడు” అని రాజు ప్రకటిస్తున్నారు, ఆయన పేరు సైన్యాల యెహోవా, “పర్వతాల మధ్య తాబోరు లాంటివాడు, సముద్రం ఒడ్డున ఉన్న కర్మెలు లాంటివాడు వస్తాడు.
19
ఈజిప్టులో నివసించేవారలారా, బందీలుగా వెళ్లడానికి మీ సామాన్లు సర్దుకోండి, ఎందుకంటే మెంఫిసు పాడుచేయబడి, నివాసులు లేక శిథిలమవుతుంది.
20
“ఈజిప్టు అందమైన పాడి ఆవు, అయితే దాని మీదికి ఉత్తరం నుండి జోరీగ వస్తున్నది.
21
దాని శాలల్లో ఉన్న కిరాయి సైనికులు బలిసిన దూడల వంటివారు. వారు కూడా నిలబడలేక, వెనక్కి పారిపోతారు. విపత్తు రోజు వారి మీదికి రాబోతోంది, అది వారు శిక్షించబడే సమయము.
22
శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు పారిపోతున్న సర్పంలా ఈజిప్టు బుసలు కొడుతుంది. చెట్లు నరికేవారు గొడ్డళ్లతో వచ్చినట్లు వారు ఆమె మీదికి వస్తారు.
23
ఆమె దట్టమైన అడవులను, వారు నరికివేస్తారు” అని యెహోవా చెప్తున్నారు. “వారి సంఖ్య మిడతల కంటే ఎక్కువ, వారిని లెక్కించలేము.
24
ఈజిప్టు కుమార్తె అవమానించబడుతుంది, ఉత్తరాది ప్రజల చేతికి అప్పగించబడుతుంది.”
25
ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “తేబేసులోని ఆమోను దేవున్ని, ఫరోను, ఈజిప్టును దాని దేవుళ్ళను, రాజులను, ఫరోను నమ్ముకున్న వారిని శిక్షించబోతున్నాను.
26
వారిని చంపాలనుకున్న వారి చేతులకు అనగా బబులోను రాజైన నెబుకద్నెజరుకు అతని అధికారులకు నేను వారిని అప్పగిస్తాను. ఆ తర్వాత ఈజిప్టు గతంలో ఉన్నట్లే నివాసయోగ్యంగా ఉంటుంది” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options