కంటెంట్‌కు వెళ్లండి
యెషయా 9:8-21

ఇశ్రాయేలుపై యెహోవా నేరారోపణ

యెషయా 9:8-21
8
ప్రభువు యాకోబుకు వ్యతిరేకంగా ఒక సందేశం పంపారు; అది ఇశ్రాయేలు మీద పడుతుంది.
9
గర్వం, అహంకారంతో నిండిన హృదయం కలిగిన ప్రజలందరు అనగా ఎఫ్రాయిం, సమరయ వాసులు దానిని తెలుసుకుంటారు.
10
“ఇటుకలు పడిపోయాయి, కాని మనం చెక్కిన రాళ్లతో మళ్ళీ కడదాము; రావి చెట్లు నరకబడ్డాయి, వాటికి బదులుగా దేవదారులను వేద్దాం” అని అంటారు.
11
అయితే యెహోవా వారి మీదికి రెజీను విరోధులను లేపారు వారి శత్రువులను పురికొల్పారు.
12
తూర్పు నుండి అరామీయులు, పడమర నుండి ఫిలిష్తీయులు నోరు తెరచి ఇశ్రాయేలును మ్రింగివేశారు. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
13
అయితే ప్రజలు తమను కొట్టినవాడి వైపు తిరుగలేదు, సైన్యాల యెహోవాను వారు వెదకలేదు.
14
కాబట్టి యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, తాటికొమ్మను, జమ్ము రెల్లును ఒకేరోజున తొలగిస్తారు.
15
పెద్దలు ప్రముఖులు తల అయితే, అబద్ధాలు చెప్పే ప్రవక్తలు తోక.
16
ఈ ప్రజలను నడిపించేవారు వారిని తప్పుదారి పట్టిస్తారు; వారిని వెంబడించేవారు చెదిరిపోతారు.
17
కాబట్టి ప్రభువు యువకులను చూసి సంతోషించరు తండ్రిలేనివారి పట్ల, విధవరాండ్ర పట్ల జాలి చూపరు. ఎందుకంటే, ప్రతి ఒక్కరు భక్తిహీనులుగా దుర్మార్గులుగా ఉన్నారు, ప్రతి నోరు మూర్ఖంగా మాట్లాడుతుంది. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
18
ఖచ్చితంగా దుష్టత్వం అగ్నిలా మండుతుంది అది గచ్చపొదలను, ముళ్ళచెట్లను కాల్చివేస్తుంది; అడవి పొదలను దహనం చేసి దట్టమైన పొగలా పైకి లేస్తుంది.
19
సైన్యాల యెహోవా ఉగ్రత వలన భూమి కాలిపోతుంది ప్రజలు అగ్నికి ఇంధనం అవుతారు; వారిలో ఒకరిపై మరొకరికి కనికరం ఉండదు.
20
కుడి ప్రక్కన దానిని వారు మ్రింగుతారు కాని ఇంకా ఆకలితోనే ఉంటారు. ఎడమ ప్రక్కన దానిని తింటారు కాని తృప్తి పొందరు. వారిలో ప్రతిఒక్కరు తన సంతానం యొక్క మాంసాన్ని తింటారు.
21
మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిం మనష్షేను తింటారు. వీరిద్దరు కలిసి యూదా మీద పడతారు. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options