యెషయా 29:9-16
9
నివ్వెరపోండి, ఆశ్చర్యపడండి. మిమ్మల్ని మీరు చూపులేని గ్రుడ్డివారిగా చేసుకోండి; ద్రాక్షరసం త్రాగకుండానే మత్తులో ఉండండి, మద్యపానం చేయకుండానే తూలుతూ ఉండండి.
10
యెహోవా మీకు గాఢనిద్ర కలిగించారు: మీకు కళ్లుగా ఉన్న ప్రవక్తలను ఆయన మూసివేశారు; మీ తలలుగా ఉన్న దీర్ఘదర్శులకు ఆయన ముసుగు వేశారు.
11
మీకు ఈ దర్శనమంతా ముద్ర వేసిన గ్రంథంలోని మాటల్లా ఉంది. మీరు దానిని చదవగలిగిన వారికి ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నేను చదవలేను; అది ముద్రించబడింది” అని జవాబిస్తారు.
12
చదవడం రాని వానికి గ్రంథపుచుట్ట ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నాకు చదవడం రాదు” అని జవాబిస్తారు.
13
ప్రభువు ఇలా అంటున్నారు: “ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు. పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కాని వారి హృదయాలు నా నుండి దూరంగా ఉన్నాయి. వారికి బోధించబడిన మానవ నియమాల ప్రకారం మాత్రమే నా పట్ల భయభక్తులు చూపుతున్నారు.
14
కాబట్టి నేను మరొకసారి ఈ ప్రజలను ఆశ్చర్యాలతో ఆశ్చర్యపరుస్తాను; జ్ఞానుల జ్ఞానం నశిస్తుంది వివేకుల వివేకం మాయమైపోతుంది.”
15
తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా దాచడానికి గొప్ప లోతుల్లోకి వెళ్లే వారికి శ్రమ. “మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు తెలుసుకుంటారు?” అని అనుకుని, చీకటిలో తమ పనులు చేసేవారికి శ్రమ.
16
మీరు విషయాలను తలక్రిందులుగా చూస్తారు కుమ్మరిని మట్టితో సమానంగా చూస్తారు! చేయబడిన వస్తువు దానిని చేసినవానితో, “నీవు నన్ను చేయలేదు” అని అనవచ్చా? కుండ కుమ్మరితో, “నీకు ఏమి తెలియదు” అని అనవచ్చా?
Settings