యెషయా 29:1-8
1
అరీయేలుకు శ్రమ దావీదు శిబిరం వేసుకున్న అరీయేలు పట్టణానికి శ్రమ! సంవత్సరం తర్వాత సంవత్సరం గడవనివ్వండి పండుగలు క్రమంగా జరుగనివ్వండి.
2
అయినా నేను అరీయేలును ముట్టడిస్తాను; అది దుఃఖించి రోదిస్తుంది. అది నాకు అగ్నిగుండంలా అవుతుంది.
3
నీకు వ్యతిరేకంగా అన్నివైపులా నేను శిబిరం ఏర్పాటు చేస్తాను; గోపురాలతో నిన్ను చుట్టుముట్టి నీకు వ్యతిరేకంగా ముట్టడి దిబ్బలు ఏర్పాటు చేస్తాను.
4
అప్పుడు నీవు క్రిందపడి నేలపై నుండి మాట్లాడతావు; నీ మాట ధూళినుండి గొణుగుతున్నట్లు ఉంటుంది. దయ్యం స్వరంలా నీ స్వరం నేల నుండి వస్తుంది; ధూళినుండి నీ మాట గుసగుసలాడుతుంది.
5
కాని నీ శత్రువులు సన్నటి ధూళిలా మారతారు; క్రూరుల గుంపు ఎగిరిపోయే పొట్టులా ఉంటుంది. హఠాత్తుగా ఒక క్షణంలోనే ఇది జరుగుతుంది.
6
ఉరుముతో, భూకంపంతో, గొప్ప శబ్దంతో సుడిగాలి తుఫానుతో దహించే అగ్నిజ్వాలలతో సైన్యాల యెహోవా వస్తారు.
7
అప్పుడు అరీయేలుతో యుద్ధం చేసే అన్ని దేశాల గుంపులు దాని మీద దాడి చేసి దాని కోటను ముట్టడించేవారు ఒక కలలా ఉంటారు రాత్రివేళలో వచ్చే దర్శనంలా ఉంటారు.
8
ఆకలితో ఉన్నవారు తింటున్నట్లు కల కని కాని ఇంకా ఆకలితోనే మేల్కొన్నట్లు, దాహంతో ఉన్నవారు త్రాగినట్లు కల కని ఇంకా అలసిపోయి దాహంతోనే మేల్కొన్నట్లు ఉంటారు. సీయోను కొండకు వ్యతిరేకంగా యుద్ధం చేసే అన్ని దేశాల గుంపులకు ఇలా ఉంటుంది.
Settings