Skip to content
హెబ్రీయులకు 13:15-25

హెబ్రీయులకు 13:15-25

15
కాబట్టి, యేసు ద్వారా, ఆయన పేరును బహిరంగంగా ఒప్పుకునే పెదవుల ఫలంతో మనం నిరంతరం దేవునికి స్తుతి బలిని అర్పిద్దాము.
16
ఉపకారం చేయడం, ఇతరులతో పంచుకోవడం అనే యాగాలను చేయడం మరువకండి, ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైనవి.
17
మీ నాయకులపై నమ్మకం ఉంచండి, వారి అధికారానికి లోబడి ఉండండి, ఎందుకంటే వారు మీ ఆత్మలను గురించి లెక్క అప్పగించాల్సిన వారుగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వారు తమ పనిని భారంగా భావించి చేస్తే, మీకు ఏ ప్రయోజనం ఉండదు, కాబట్టి వారు చేయవలసిన పనిని భారంగా కాకుండా ఆనందంగా చేసేలా చూడండి.
18
మాకోసం ప్రార్థించండి. మేము అన్ని విధాలుగా గౌరవప్రదంగా జీవించాలనే ఆశ కలిగి స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముతున్నాము.
19
త్వరలో నేను మిమ్మల్ని కలుసుకొనేలా నా కోసం ప్రార్థించమని మిమ్మల్ని ప్రత్యేకంగా బ్రతిమాలుతున్నాను.
20
నిత్య నిబంధన యొక్క రక్తం ద్వారా గొర్రెల గొప్ప కాపరియైన, ప్రభువైన యేసును మృతులలో నుండి తిరిగి వెనుకకు తెచ్చిన సమాధానకర్తయైన దేవుడు,
21
తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి మంచిదానితో మిమ్మల్ని సిద్ధపరచును గాక, ఆయనకు ఇష్టమైనదాన్ని యేసు క్రీస్తు ద్వారా ఆయన మనలో జరిగించుగాక, ఆయనకే నిరంతరం మహిమ కలుగును గాక ఆమేన్.
22
సహోదరీ సహోదరులారా! నా హెచ్చరిక మాటను భరించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను, వాస్తవానికి నేను మీకు చాలా క్లుప్తంగా వ్రాశాను.
23
మన సహోదరుడైన తిమోతి చెరసాల నుండి విడుదల అయ్యాడని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అతడు త్వరగా వస్తే, నేను మిమ్మల్ని చూడడానికి అతనితో కలిసి వస్తాను.
24
మీ నాయకులందరికి, పరిశుద్ధులందరికి వందనాలు తెలియజేయండి. ఇటలీ దేశపు సహోదరులు మీకు వందనాలు తెలియజేస్తున్నారు.
25
కృప మీ అందరితో ఉండును గాక.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options