Skip to content
ఎస్తేరు 9:20-28

ఎస్తేరు 9:20-28

20
మొర్దెకై ఈ సంగతులన్ని నమోదు చేసి, రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటికి దగ్గరలో దూరంలో నివసిస్తున్న యూదులందరికి ఉత్తరాలు పంపాడు.
21
యూదులు తమ శత్రువుల నుండి ఉపశమనం పొందుకున్నారు, తమ బాధ సంతోషంగా మారింది, తమ దుఃఖం ఆనందించే రోజుగా మారింది కాబట్టి ప్రతి ఏట అదారు నెల పద్నాలుగు, పదిహేను రోజుల్లో వార్షిక పండగ జరుపుకోవాలని అతడు వ్రాశాడు. ఆ రోజులు విందు చేసుకుని ఆనందించే రోజులుగా, ఒకరికి ఒకరు ఆహార బహుమానాలు ఇచ్చుకునే రోజులుగా, పేదలకు బహుమానాలు ఇచ్చే రోజులుగా జరుపుకోవాలాని అతడు వారికి వ్రాశాడు.
23
కాబట్టి యూదులు మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారం తాము ప్రారంభించిన ఉత్సవం కొనసాగిస్తామని ఒప్పుకున్నారు.
24
యూదులందరికి శత్రువైన అగగీయుడు హమ్మెదాతా కుమారుడైన హామాను యూదులను నాశనం చేయడానికి కుట్రపన్ని, వారిని నాశనం చేసి, నిర్మూలించడానికి పూరు (అనగా, చీట్లు) వేశాడు.
25
అయితే ఈ కుట్ర గురించి రాజుకు తెలిసినప్పుడు, అతడు హామాను యూదులకు వ్యతిరేకంగా తలపెట్టిన కీడు అతని మీదికే వచ్చేలా చేసి, అతన్ని అతని కుమారులను ఉరికంబాలకు వ్రేలాడదీయాలని రాజు వ్రాతపూర్వక ఆదేశాలు జారీ చేశాడు.
26
(అందువల్ల ఈ రోజులకు పూరు అనే పదం నుండి వచ్చిన పూరీము అని పేరు వచ్చింది.) ఈ ఉత్తరంలో వ్రాయబడిన ప్రతి విషయం బట్టి, వారు చూసిన, తమకు జరిగిన వాటిని బట్టి, వారు ఏమి చూశారో, వారికి ఏమి జరిగిందో దానిని బట్టి,
27
యూదులు ప్రతి సంవత్సరం ఈ రెండు రోజులను ఒక ఆచారంగా నిర్ణయించిన విధానంలో నియమించిన సమయంలో తాము తమ వారసులు, తమతో కలిసే వారందరితో ఖచ్చితంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
28
తరతరాల వరకు ప్రతి సంస్థానంలో, ప్రతి పట్టణంలో, ప్రతి కుటుంబం ద్వారా వచ్చే ప్రతి తరం వారు ఈ రోజులను జ్ఞాపకం చేసుకుని ఉత్సవంగా జరుపుకోవాలి. యూదులు ఈ పూరీము రోజులు పాటించకుండా ఉండకూడదు. ఈ రోజుల జ్ఞాపకం వారి వారసులు ఎన్నడూ మరచిపోకూడదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options