అపొస్తలుల కార్యములు 23:1-10
1
పౌలు న్వాయసభ వారిని సూటిగా చూసి, “నా సహోదరులారా, ఈ రోజు వరకు నేను నా మంచి మనస్సాక్షితో దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేశాను” అని చెప్పాడు.
2
అందుకు ప్రధాన యాజకుడైన అననీయ, పౌలుకు దగ్గరగా నిలబడి ఉన్నవానితో, అతని నోటి మీద కొట్టమని ఆదేశించాడు.
3
అప్పుడు పౌలు అతనితో, “ఓ సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు! ధర్మశాస్త్రం ప్రకారం నాకు తీర్పు తీర్చడానికి అక్కడ కూర్చుని, నన్ను కొట్టమని ఆదేశించి నీవు ధర్మశాస్త్ర ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు!” అన్నాడు.
4
పౌలుకు దగ్గరగా నిలబడినవారు, “దేవుని ప్రధాన యాజకుని విమర్శించడానికి నీకెంత ధైర్యం!” అన్నారు.
5
అందుకు పౌలు, “సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు; అయితే ‘మీ ప్రజల అధికారులను నిందించవద్దు అని’ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది” అన్నాడు.
6
అక్కడ ఉన్నవారిలో కొందరు సద్దూకయ్యులు మరికొందరు పరిసయ్యులు ఉన్నారని పౌలు గ్రహించి, ఆ న్యాయసభలోని వారితో, “నా సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతానంగా పుట్టాను. నేను మృతులకు పునరుత్థానం ఉందనే నిరీక్షణను బట్టి ఈ విచారణ పాలయ్యాను” అని బిగ్గరగా చెప్పాడు.
7
అతడు ఆ విధంగా చెప్పిన వెంటనే, అక్కడ ఉన్న పరిసయ్యులు సద్దూకయ్యుల మధ్య విభేదం పుట్టి, ఆ సభ రెండుగా చీలిపోయింది.
8
ఎందుకంటే, సద్దూకయ్యులు పునరుత్థానం లేదని, దేవదూతలు లేరని, ఆత్మలు లేవని అంటారు. కానీ పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయని నమ్ముతారు.
9
అప్పుడు పరిసయ్యులలోని ధర్మశాస్త్ర ఉపదేశకులు కొందరు లేచి, “ఈ వ్యక్తిలో మాకు ఏ తప్పు కనిపించడం లేదు, అతనితో ఆత్మ కాని దేవదూత కాని మాట్లాడి ఉంటే తప్పు ఏంటి?” అని అడుగుతూ గట్టిగా వాదించారు, కాబట్టి గొప్ప అల్లరి చెలరేగింది.
10
ఈ విభేదం మరింత హింసాత్మకంగా మారినందుకు పౌలును ముక్కలుగా చీల్చివేస్తారేమో అని ఆ అధిపతి భయపడ్డాడు. అతడు సైనికులను వెళ్లి వారి మధ్యలో నుండి పౌలును బలవంతంగా పట్టుకుని, సైనికుల కోటలోకి తీసుకుని రమ్మని ఆదేశించాడు.
Settings