Skip to content
2 దినవృత్తాంతములు 35:1-18

2 దినవృత్తాంతములు 35:1-18

1
యోషీయా యెరూషలేములో యెహోవాకు పస్కా పండుగ ఆచరించాడు. మొదటి నెల పద్నాలుగవ రోజు ప్రజలు పస్కా గొర్రెపిల్లను వధించారు.
2
యోషీయా యాజకులను వారి విధులకు నియమించి యెహోవా ఆలయ సేవను జరిగించేలా వారిని ప్రోత్సహించాడు.
3
ఇశ్రాయేలీయులందరికి బోధించిన, యెహోవాకు ప్రతిష్ఠించబడిన లేవీయులతో అతడు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన మందిరంలో పవిత్ర మందసాన్ని ఉంచండి. ఇది మీ భుజాలపై మోయకూడదు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవాకు, ఆయన ప్రజలైన ఇశ్రాయేలుకు సేవ చేయండి.
4
ఇశ్రాయేలు రాజైన దావీదు అతని కుమారుడు సొలొమోను వ్రాసిన సూచనల ప్రకారం, మీ కుటుంబాల విభాగాల ప్రకారం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.
5
“మీ తోటి ఇశ్రాయేలీయులు, సామాన్య ప్రజల కుటుంబాల్లోని ప్రతి ఉపవిభాగం కోసం లేవీయుల సమూహంతో పరిశుద్ధ స్థలంలో నిలబడండి.
6
యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు, పస్కా గొర్రెపిల్లలను వధించి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. మీ తోటి ఇశ్రాయేలీయుల కోసం గొర్రెపిల్లలను సిద్ధం చేయండి.”
7
యోషీయా రాజు అక్కడున్న సామాన్యులందరికీ తన సొంత ఆస్తుల నుండి పస్కా అర్పణల కోసం మొత్తం 30,000 గొర్రెపిల్లలు మేకలను అందించాడు, అలాగే 3,000 కోడెలను అందించాడు.
8
అతని అధికారులు కూడా ప్రజలకు, యాజకులకు లేవీయులకు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. దేవుని ఆలయ బాధ్యత వహించిన హిల్కీయా, జెకర్యా, యెహీయేలు, యాజకులకు 2,600 గొర్రెపిల్లలు మేకలను పస్కా అర్పణలుగా అందించాడు, అలాగే 300 కోడెలను అందించాడు.
9
కొనన్యా, అతని సహోదరులైన షెమయా, నెతనేలు, లేవీయుల నాయకులైన హషబ్యా, యెహీయేలు, యోజాబాదులు లేవీయుల కోసం 5,000 గొర్రెపిల్లలు మేకలు 500 కోడెలను పస్కా అర్పణలుగా ఇచ్చారు.
10
సేవకు అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పుడు రాజు ఆజ్ఞ ప్రకారం యాజకులు స్థలాల్లో లేవీయులు తమ వరుసల్లో నిలబడ్డారు.
11
పస్కా గొర్రెపిల్లలు వధించబడ్డాయి, లేవీయులు జంతువుల చర్మం తీస్తూ ఉండగా, యాజకులు వాటి రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు.
12
మోషే గ్రంథంలో వ్రాయబడినట్లుగా, యెహోవాకు అర్పించడానికి ప్రజల కుటుంబాల యొక్క ఉపవిభాగాలకు ఇవ్వడానికి వారు దహనబలులను ప్రక్కన పెట్టారు. పశువుల విషయంలోను అలాగే చేశారు.
13
నిర్దేశించబడిన ప్రకారం వారు పస్కా జంతువులను నిప్పుమీద కాల్చారు, అలాగే వారు పరిశుద్ధ అర్పణలను కుండల్లో, బానలలో, కడాయిలలో ఉడకబెట్టి, ప్రజలందరికి త్వరగా వడ్డించారు.
14
దీని తర్వాత, వారు తమ కోసం యాజకుల కోసం సిద్ధం చేశారు. ఎందుకంటే అహరోను వంశస్థులైన యాజకులు రాత్రి ప్రొద్దుపోయే వరకు దహనబలులను క్రొవ్వు భాగాలను అర్పించారు. కాబట్టి లేవీయులు తమ కోసం అహరోను యాజకుల కోసం సిద్ధం చేసుకున్నారు.
15
దావీదు, ఆసాపు, హేమాను, రాజుకు దీర్ఘదర్శియైన యెదూతూను నియమించిన ప్రకారం, ఆసాపు వారసులైన సంగీతకారులు తమ స్థలాల్లో ఉన్నారు. ప్రతి ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకులు తమ సేవను విడిచి రాకుండ వారి బంధువులైన లేవీయులు వారి కోసం మాంసం సిద్ధం చేశారు.
16
ఈ విధంగా రాజైన యోషీయా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆ రోజు వారు పస్కా పండుగ ఆచరించాడు. యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించారు. యెహోవా సేవ ఏమీ లోపం లేకుండా జరిగింది.
17
అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఆ సమయంలో పస్కా పండుగను పులియని రొట్టెల పండుగను ఏడు రోజులపాటు జరుపుకున్నారు.
18
సమూయేలు ప్రవక్త రోజులనుండి ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనంగా జరగలేదు. యాజకులు, లేవీయులు, హాజరైన యూదా వారందరూ, ఇశ్రాయేలు వారందరూ, యెరూషలేము కాపురస్థులందరితో కలిసి యోషీయా పస్కా ఆచరించిన విధంగా ఇశ్రాయేలు రాజులు ఎన్నడూ ఆచరించలేదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options