1 తిమోతి 5:3-15
3
నిజంగా అవసరంలో ఉన్న విధవరాండ్రకు సరియైన గుర్తింపు ఇవ్వు.
4
కాని ఏ విధవరాలికైన పిల్లలు గాని మనుమలు గాని ఉంటే, ఆ పిల్లలు ముందుగా తమ కుటుంబంపట్ల శ్రద్ధ వహించడం, తమ తల్లిదండ్రులను వారి తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా తాము పాటించే ధర్మాన్ని ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి, ఇది దేవుని సంతోషపరుస్తుంది.
5
నిజంగా ఒంటరియైన, అవసరంలో ఉన్న విధవరాలు దేవునిపై ఆధారపడి రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ సహాయం కోసం దేవున్ని అడుగుతూ ఉంటుంది.
6
తన సొంతసుఖాల కోసం జీవించే విధవరాలు జీవించి ఉన్నా మరణించినట్లే.
7
ఎవరు కూడా నిందించబడకుండా ఉండడానికి ప్రజలకు ఈ సూచనలన్నింటిని చెప్పు.
8
ఎవరైనా తమ బంధువులకు, మరి ముఖ్యంగా తన సొంత కుటుంబీకుల అవసరాలను తీర్చలేకపోతే అలాంటివారు విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లే, వారు అవిశ్వాసుల కంటే చెడ్డవారు.
9
ఏ విధవరాలినైనా విధవరాండ్రల జాబితాలో చేర్చాలంటే, ఆమె అరవై సంవత్సరాలుకు పైబడి, తన భర్తకు నమ్మకంగా ఉండి,
10
తన మంచిపనుల బట్టి సంఘంలో గుర్తింపు కలిగి ఉండాలి, అనగా పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పరిశుద్ధుల పాదాలు కడగడం, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం అన్ని రకాల మంచి పనులు చేయడంలో ముందు ఉండాలి.
11
అయితే యవ్వన విధవరాండ్రను ఆ జాబితాలో చేర్చకూడదు. ఎందుకంటే, వారు మేము క్రీస్తు కొరకే జీవిస్తామని నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత, తమ శారీరక వాంఛలకు లొంగిపోయి పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.
12
ఈ విధంగా వారు దేవునితో చేసుకున్న తమ మొదటి ఒప్పందాన్ని నిలుపుకోలేక తమపైకి తామే తీర్పును తెచ్చుకుంటారు.
13
అంతేకాక వారు సోమరులుగా ఇంటింటికి తిరుగుతూ అనవసరమైన ముచ్చట్లతో, మాట్లాడకూడనివి మాట్లాడుతూ, ఇతరుల పనులలో జోక్యం చేసుకోవడం అలవాటు చేసుకుంటారు.
14
కాబట్టి యవ్వన విధవరాండ్రకు నేను చెప్పేది ఏంటంటే, వారు పెళ్ళి చేసుకుని పిల్లలను కని, తమ గృహాలను శ్రద్ధగా చూసుకొంటూ, తమను నిందించడానికి విరోధికి అవకాశమివ్వకుండా చూసుకోవాలి.
15
అయితే ఇప్పటికే కొందరు దారితప్పి సాతానును అనుసరిస్తున్నారు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings