Skip to content
1 రాజులు 22:6-18

1 రాజులు 22:6-18

6
కాబట్టి ఇశ్రాయేలు రాజు సుమారు నాలుగువందలమంది ప్రవక్తలను పిలిపించి, “నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా? లేదా వెళ్లొద్దా?” అని వారిని అడిగాడు. “వెళ్లండి! దానిని యెహోవా రాజు వశం చేస్తారు” అని వారు జవాబిచ్చారు.
7
అయితే యెహోషాపాతు, “మనం విచారణ చేయడానికి యెహోవా ప్రవక్త ఒక్కడు కూడా ఇక్కడ లేడా?” అని అడిగాడు.
8
అందుకు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “ఇంకొక ప్రవక్త ఉన్నాడు, అతని ద్వారా యెహోవా దగ్గర విచారణ చేయవచ్చు. కాని, నాకు అతడంటే అయిష్టం, ఎందుకంటే అతడు నా గురించి ఎప్పుడూ మంచిని ప్రవచించడు, ఎప్పుడూ చెడ్డగానే ప్రవచిస్తాడు. అతడు ఇమ్లా కుమారుడైన మీకాయా” అని చెప్పాడు. అందుకు యెహోషాపాతు, “రాజా, మీరు అలా అనవద్దు” అన్నాడు.
9
అప్పుడు ఇశ్రాయేలు రాజు తన అధికారులలో ఒకరిని పిలిచి, “వెంటనే వెళ్లి ఇమ్లా కుమారుడైన మీకాయాను తీసుకురా” అని చెప్పాడు.
10
ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకొని సమరయ నగర ద్వారం దగ్గర ఉన్న నూర్పిడి కళ్ళం దగ్గరలో ప్రవక్తలంతా ప్రవచిస్తూ ఉండగా, తమ సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు.
11
అప్పుడు కెనాన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేసుకుని వచ్చి, “యెహోవా చెప్పే మాట ఇదే; ‘అరామీయులు నాశనమయ్యే వరకు మీరు వీటితో వారిని పొడుస్తారు’ ” అని చెప్పాడు.
12
ఇతర ప్రవక్తలంతా కూడా అదే విషయాన్ని ప్రవచించారు. “రామోత్ గిలాదు మీద దాడి చేయండి విజయం పొందండి, ఎందుకంటే యెహోవా దాన్ని రాజు చేతికి అప్పగిస్తారు” అని వారన్నారు.
13
మీకాయాను పిలువడానికి వెళ్లిన దూత మీకాయాతో, “చూడు, ఇతర ప్రవక్తలందరు రాజుకు విజయం కలుగుతుందని చెప్తున్నారు. వారి మాటతో నీ మాట ఏకమై, అనుకూలంగా పలుకాలి” అన్నాడు.
14
అయితే మీకాయా, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నా, యెహోవా నాకు చెప్పేది మాత్రమే నేను అతనికి చెప్పగలను” అని అన్నాడు.
15
అతడు వచ్చినప్పుడు రాజు అతన్ని, “మీకాయా, మేము రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా, లేదా?” అని అడిగాడు. అందుకతడు, “దాడి చేయండి, విజయం పొందండి, ఎందుకంటే యెహోవా దానిని రాజు చేతికి అప్పగిస్తారు” అని జవాబిచ్చాడు.
16
రాజు అతనితో, “యెహోవా పేరిట నాకు సత్యమే చెప్పమని నేనెన్నిసార్లు నీ చేత ప్రమాణం చేయించాలి?” అని అన్నాడు.
17
అప్పుడు మీకాయా జవాబిస్తూ, “ఇశ్రాయేలీయులందరు కాపరి లేని గొర్రెల్లా కొండలమీద చెదిరిపోయినట్లు దర్శనం చూశాను. ‘ఈ ప్రజలకు యజమాని లేడు. ప్రతి ఒక్కరు సమాధానంగా ఇంటికి వెళ్లాలి’ అని యెహోవా చెప్తున్నారు” అన్నాడు.
18
ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “నా గురించి ఇతడు ఎన్నడు మంచిని ప్రవచించడు, చెడు మాత్రమే ప్రవచిస్తాడు అని మీతో చెప్పలేదా?” అని అన్నాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options