Skip to content
1 రాజులు 19:1-14

1 రాజులు 19:1-14

1
అహాబు వెళ్లి, ఏలీయా చేసిందంతా ప్రవక్తలందరినీ ఖడ్గంతో చంపిన సంగతంతా యెజెబెలుకు చెప్పాడు.
2
అందుకు యెజెబెలు, “రేపు ఈ సమయానికి నీవు వారిని చంపినట్లు నేను నిన్ను చంపకపోతే దేవుళ్ళు నన్ను ఇంతకంటే తీవ్రంగా శిక్షించుదురు గాక” అని ఒక దూతతో ఏలీయాకు కబురు పంపింది.
3
ఏలీయా భయపడి, తన ప్రాణం కాపాడుకోడానికి పారిపోయాడు. అతడు యూదాలోని బెయేర్షేబకు చేరి, అక్కడ తన సేవకుడిని విడిచిపెట్టి,
4
అతడు మాత్రం ఎడారిలోకి రోజంతా ప్రయాణం చేశాడు. ఒక బదరీచెట్టు క్రింద కూర్చుని చనిపోవాలని కోరుతూ, “యెహోవా, నా ప్రాణం తీసుకోండి; నేను నా పూర్వికులకంటే గొప్పవాన్ని కాను” అని ప్రార్థించాడు.
5
తర్వాత అతడు ఆ బదరీచెట్టు క్రింద పడుకుని నిద్రపోయాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక దేవదూత అతన్ని తట్టి, “లేచి తిను” అన్నాడు.
6
అతడు కళ్లు తెరిచి చూస్తే అతని తల దగ్గర సీసాలో నీళ్లు నిప్పుల మీద కాల్చిన రొట్టె కనిపించాయి. అతడు తిని త్రాగి మళ్ళీ పడుకున్నాడు.
7
తర్వాత యెహోవా దూత రెండవసారి వచ్చి అతన్ని తట్టి, “లేచి తిను ఎందుకంటే నీవు దూర ప్రయాణం చేయాల్సి ఉంది” అన్నాడు.
8
కాబట్టి అతడు లేచి తిని నీళ్లు త్రాగాడు. ఆ ఆహారం వల్ల బలం పొందుకొని నలభై రాత్రింబగళ్ళు ప్రయాణించి దేవుని పర్వతమైన హోరేబును చేరుకున్నాడు.
9
అక్కడ అతడు ఒక గుహలో ఆ రాత్రి గడిపాడు. యెహోవా వాక్కు, “ఏలీయా, ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అతన్ని అడిగింది.
10
అతడు జవాబిస్తూ, “నేను సైన్యాల యెహోవా దేవుని పట్ల ఎంతో రోషం కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మీ నిబంధనను తిరస్కరించారు, మీ బలిపీఠాలను పడగొట్టారు, మీ ప్రవక్తలను ఖడ్గంతో చంపారు. నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను, ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు” అని చెప్పాడు.
11
అందుకు యెహోవా, “బయటకు వెళ్లి, పర్వతం మీద యెహోవా సమక్షంలో నిలబడు, ఎందుకంటే యెహోవా అక్కడినుండి దాటి వెళ్లబోతున్నారు” అన్నారు. అప్పుడు ఒక గొప్ప బలమైన గాలి వచ్చి పర్వతాలను చీల్చింది, యెహోవా ఎదుట బండలను బద్దలు చేసింది, అయితే యెహోవా ఆ గాలిలో లేరు. గాలి తర్వాత భూకంపం వచ్చింది, కాని యెహోవా ఆ భూకంపంలో లేరు.
12
భూకంపం తర్వాత అగ్ని వచ్చింది, కాని యెహోవా ఆ అగ్నిలో లేరు. అగ్ని తర్వాత మెల్లని స్వరం వినిపించింది.
13
ఏలీయా ఆ స్వరం వినగానే, తన వస్ర్తంతో ముఖం కప్పుకుని వెళ్లి ఆ గుహ ద్వారం దగ్గర నిలబడ్డాడు. అప్పుడు అతనికి, “ఏలీయా ఇక్కడ ఏమి చేస్తున్నావు?” అనే స్వరం వినిపించింది.
14
అతడు జవాబిస్తూ, “నేను సైన్యాల యెహోవా దేవుని పట్ల ఎంతో రోషం కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మీ నిబంధనను తిరస్కరించారు, మీ బలిపీఠాలను పడగొట్టారు, మీ ప్రవక్తలను ఖడ్గంతో చంపారు. నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను. ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు” అని చెప్పాడు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options