Skip to content
ప్రకటన 2:18-29

ప్రకటన 2:18-29

18
“తుయతైరలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: అగ్ని జ్వాలల్లాంటి కళ్లు, తళతళ మెరుస్తున్న కంచును పోలిన పాదాలు గల దేవుని కుమారుడు ఈ మాటలు చెప్తున్నాడు:
19
నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ సేవ, నీ పట్టుదల, నాకు తెలుసు. నీవు ఇప్పుడు చేసే క్రియలు ముందు చేసిన క్రియల కంటే గొప్పవని నాకు తెలుసు.
20
అయినా నేను నీ మీద తప్పు మోపవలసివున్నది: తాను ప్రవక్తిని అని చెప్పుకొనే యెజెబెలును మీరు సహిస్తున్నారు. లైంగిక దుర్నీతి, విగ్రహాలకు అర్పించిన ఆహారం తినాలని నా సేవకులకు బోధిస్తూ ఆమె వారిని మోసం చేస్తుంది.
21
ఆమె లైంగిక దుర్నీతి గురించి పశ్చాత్తాపపడడానికి నేను సమయం ఇచ్చాను కాని ఆమె దానికి ఇష్టపడలేదు.
22
కాబట్టి నేను ఆమెను శ్రమల పడకపై పడవేస్తాను. అలాగే ఆమెతో వ్యభిచరించిన వారు పశ్చాత్తాపపడకపోతే వారిని కూడా తీవ్రమైన బాధలకు గురిచేస్తాను.
23
ఆమె పిల్లలను నేను మరణానికి అప్పగిస్తాను. అప్పుడు సంఘాలన్ని నేను అంతరంగాలను, హృదయాలను పరిశోధిస్తానని, మీలో అందరికి మీ క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తానని తెలుసుకుంటాయి.
24
అయితే తుయతైరలో యెజెబెలు బోధను అంగీకరించకుండా, సాతాను లోతైన మర్మాలను నేర్చుకోకుండా ఉన్న తక్కిన వారందరికి, ‘నేను ఇక ఏ భారం నీమీద మోపనని చెప్తున్నాను.
25
కాని నేను వచ్చేవరకు నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో.’
26
అంతం వరకు నా చిత్తాన్ని నెరవేరుస్తూ జయించినవారికి నా తండ్రి నుండి నేను అధికారం పొందినట్లే రాజ్యాల మీద వారికి అధికారం ఇస్తాను.
27
‘వారు ఇనుపదండంతో రాజ్యాలను పరిపాలిస్తారు, వారిని మట్టి కుండలను పగలగొట్టినట్లు పగలగొడతారు.’
28
నేను వారికి వేకువ చుక్కను కూడా ఇస్తాను.
29
ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options