Skip to content
సంఖ్యాకాండము 15:22-29

తెలియక చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం

సంఖ్యాకాండము 15:22-29
22
“ ‘సమాజంగా మీరు అనుకోకుండ యెహోవా మోషేకు ఇచ్చిన ఈ ఆజ్ఞలలో దేనినైనా పాటించడంలో ఒకవేళ విఫలమైతే,
23
యెహోవా మోషే ద్వార మీకు ఇచ్చిన ఆజ్ఞలు, యెహోవా వాటిని ఇచ్చిన రోజు నుండి రాబోయే తరాల వరకు కొనసాగిస్తూ,
24
ఒకవేళ తెలియక పొరపాటున మీరితే, అప్పుడు సమాజమంతా యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా కోడెను, దానితో పాటు నిర్దేశించిన భోజనార్పణ, పానార్పణలతో, పాపపరిహారబలి కోసం మేకపోతుతో కలిపి అర్పించాలి.
25
యాజకుడు ఇశ్రాయేలు సమాజమంతటి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి అప్పుడు వారు క్షమించబడతారు ఎందుకంటే ఆ పాపం ఉద్దేశపూర్వకమైనది కాదు, పైగా వారు పొరపాటున చేసిన తప్పును బట్టి యెహోవాకు వారు హోమబలి పాపపరిహారబలిని అర్పించారు.
26
ప్రజలు అనుకోకుండ తప్పు చేశారు కాబట్టి ఇశ్రాయేలు సర్వసమాజం, వారితో నివసిస్తున్న విదేశీయులు క్షమించబడతారు.
27
“ ‘అయితే ఒక్క వ్యక్తి అనుకోకుండ చేసిన పాపాలకు, ఆ వ్యక్తి పాపపరిహారబలిగా ఏడాది ఆడ మేకను అర్పించాలి.
28
పొరపాటున పాపం చేసిన వారి కోసం యాజకుడు యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు, అది జరిగినప్పుడు ఆ వ్యక్తి క్షమించబడతాడు.
29
స్వదేశీయులైన ఇశ్రాయేలీయులైనా వారి మధ్యలో నివసించే విదేశీయులైనా పొరపాటున పాపం చేసినవారందరికి ఒకే చట్టం వర్తిస్తుంది.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.