మార్కు 8:1-19
1
ఆ రోజుల్లో మరొక పెద్ద గుంపు గుమికూడింది. అయితే వారు ఏమి తినలేదు, కాబట్టి యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి,
2
“ఈ ప్రజలు మూడు రోజులుగా ఏమి తినకుండా నా దగ్గరే ఉండిపోయారు; వారి మీద నాకు జాలి కలుగుతుంది.
3
నేను వీరిని ఆకలితో ఇళ్ళకు పంపితే, వారు దారిలో సొమ్మసిల్లిపోతారు ఎందుకంటే కొందరు దూరం నుండి వచ్చారు” అని చెప్పారు.
4
అందుకు ఆయన శిష్యులు, “కాని ఇంత మందికి భోజనం పెట్టి తృప్తిపరచడానికి కావలసినంత ఆహారం ఈ మారుమూల ప్రాంతంలో మనకు ఎక్కడ దొరుకుతుంది?” అన్నారు.
5
యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారిని అడిగారు. వారు, “ఏడు” అని జవాబిచ్చారు.
6
యేసు ఆ జనసమూహాన్ని నేల మీద కూర్చోమని ఆదేశించారు. ఆ ఏడు రొట్టెలను పట్టుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాటిని విరిచి జనసమూహానికి పంచిపెట్టుమని తన శిష్యులకు ఇచ్చారు, వారు పంచిపెట్టారు.
7
వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడ ఉన్నాయి; ఆయన వాటిని కూడ ఆశీర్వదించి, పంచిపెట్టుమని తన శిష్యులకు చెప్పారు.
8
ప్రజలు తిని తృప్తి పొందారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండా నింపారు.
9
తిన్న వారందరు ఇంచుమించు నాలుగు వేలమంది. యేసు వారిని పంపించిన వెంటనే,
10
ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి దల్మనూతా అనే ప్రాంతానికి వెళ్లారు.
11
పరిసయ్యులు వచ్చి యేసును ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడానికి, ఆకాశం నుండి ఒక సూచన చూపించుమని వారు ఆయనను అడిగారు.
12
అందుకు ఆయన ఆత్మలో దీర్ఘ నిట్టూర్పు విడిచి, “ఈ తరం వారు నన్ను ఎందుకు సూచన అడుగుతున్నారు? వారికి ఏ సూచన ఇవ్వబడదని నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను” అని వారితో అన్నారు.
13
తర్వాత ఆయన వారిని విడిచిపెట్టి మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డున చేరుకొన్నారు.
14
శిష్యులు తమతో రొట్టెలను తెచ్చుకోవడం మరచిపోయారు, పడవలో వారి దగ్గర ఒక్క రొట్టె తప్ప ఏమి లేదు.
15
యేసు వారితో, “పరిసయ్యుల హేరోదు వెంబడించేవారి పులిసిన పిండి మీలో ఉండకుండా చూసుకోండి” అని వారిని హెచ్చరించారు.
16
వారు, “మన దగ్గర రొట్టెలు లేవని ఇలా అన్నారు” అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.
17
వారు ఏమి చర్చించుకుంటున్నారో తెలిసినవాడై యేసు, “రొట్టెలు లేవని మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇప్పటికీ మీరు చూడలేకపోతున్నారా లేదా గ్రహించలేదా పోతున్నారా? మీ హృదయాలు కఠినమైపోయాయా?
18
మీరు కళ్లు ఉండి చూడలేకపోతున్నారా? చెవులు ఉండి వినలేకపోతున్నారా? మీకు జ్ఞాపకం లేదా?
19
నేను అయిదు రొట్టెలను విరిచి అయిదు వేలమందికి పంచినప్పుడు, మీరు ఎన్ని గంపలు ఎత్తారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు, “పన్నెండు” అని చెప్పారు.
Settings