కంటెంట్‌కు వెళ్లండి
మార్కు 7:1-23

మార్కు 7:1-23

1
యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు చుట్టూ చేరారు.
2
ఆయన శిష్యులలో కొందరు మురికి చేతులతో, అనగా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుండడం చూశారు.
3
పెద్దల సాంప్రదాయం ప్రకారం, పరిసయ్యులు యూదులందరు తమ చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు.
4
వారు సంతవీధులలో నుండి వచ్చిన తర్వాత స్నానం చేయకుండా భోజనం చేయరు. ఇంకా గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను, భోజనబల్లను నీళ్లతో కడగటం లాంటి అనేక ఆచారాలను వారు పాటిస్తారు.
5
అందుకు పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, “నీ శిష్యులు ఎందుకు పెద్దల సాంప్రదాయాన్ని పాటించకుండా అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు?” అని యేసును అడిగారు.
6
అందుకు ఆయన వారితో, “వేషధారులారా, మీ గురించి ఇలా యెషయా ప్రవచించింది నిజమే; అక్కడ వ్రాయబడి ఉన్నట్లు: “ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి.
7
వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు; వారి బోధలు కేవలం మానవ నియమాలు మాత్రమే.’
8
మీరు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం విడిచిపెట్టి మానవ ఆచారాలకు కట్టుబడి ఉన్నారు” అన్నారు.
9
ఆయన ఇంకా మాట్లాడుతూ, “మీరు మీ సొంత సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను పూర్తిగా ప్రక్కకు పెట్టేస్తున్నారు!
10
మోషే, ‘మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’ ‘ఎవరైనా తల్లిని గాని తండ్రిని గాని శపిస్తే, వారికి మరణశిక్ష విధించాలి’ అని ఆజ్ఞాపించాడు.
11
కానీ మీరు, ఒక వ్యక్తి తన తల్లితో గాని తండ్రితో గాని నా వల్ల మీరు పొందదగిన సహాయమంతా కొర్బాన్ (అంటే దేవునికి అంకితం) అని ప్రకటిస్తే,
12
వాడు తన తండ్రికి తల్లికి ఏమి చేయనక్కరలేదు అని చెప్తున్నారు.
13
ఈ విధంగా మీరు నియమించుకొన్న మీ సాంప్రదాయం వలన దేవుని వాక్యాన్ని అర్థం లేనిదానిగా చేస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నో మీరు చేస్తున్నారు” అని చెప్పారు.
14
యేసు జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కరు, నా మాట విని, గ్రహించండి.
15
బయట నుండి లోపలికి వెళ్లేవీ ఒకరిని అపవిత్రపరచవు. కాని లోపలి నుండి బయటకు వచ్చేవి మాత్రమే వారిని అపవిత్రులుగా చేస్తాయి.
16
వినడానికి చెవులు కలవారు విందురు గాక!” అని అన్నారు.
17
ఆయన ఆ జనసమూహాన్ని విడిచి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, ఆయన శిష్యులు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు.
18
ఆయన, “మీరు ఇంత బుద్ధిహీనులా? బయట నుండి లోపలికి వెళ్లేది ఏది ఒకరిని అపవిత్రపరచదని మీరు చూడలేదా? అని అడిగారు.
19
ఎందుకంటే అది వాని హృదయంలోకి వెళ్లదు, కాని కడుపులోనికి వెళ్లి, తర్వాత శరీరం నుండి బయటకు విసర్జింపబడుతుంది.” (ఈ విషయాన్ని చెప్తూ, భోజనపదార్ధాలన్ని పవిత్రమైనవే అని యేసు ప్రకటించారు.)
20
ఆయన ఇంకా మాట్లాడుతూ, “ఓ వ్యక్తి లోపలినుండి ఏవైతే బయటకు వస్తాయో అవే వారిని అపవిత్రపరుస్తాయి.
21
ఎందుకంటే, అంతరంగంలో నుండి లైంగిక అనైతికత, దొంగతనం, నరహత్య,
22
వ్యభిచారం, దురాశ, పగ, మోసం, అశ్లీలత, అసూయ, దూషణ, అహంకారం, అవివేకం లాంటి దుష్ట ఆలోచనలు వస్తాయి.
23
ఈ దుష్టమైనవన్ని లోపలినుండే బయటకు వచ్చి వ్యక్తిని అపవిత్రపరుస్తాయి” అన్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options