లూకా 9:10-17
10
అపొస్తలులు తిరిగివచ్చి, తాము చేసినవి యేసుకు తెలియజేశారు. అప్పుడు యేసు వారిని వెంటబెట్టుకుని బేత్సయిదా అనే గ్రామానికి ఏకాంతంగా వెళ్లారు,
11
అయితే అది తెలుసుకొని జనసమూహాలు ఆయనను వెంబడించారు. ఆయన వారిని చేర్చుకొని వారికి దేవుని రాజ్యం గురించి బోధిస్తూ, అవసరం ఉన్నవారిని స్వస్థపరిచారు.
12
ప్రొద్దుగూకే సమయంలో ఆ పన్నెండుమంది ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం కాబట్టి జనసమూహాన్ని పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు బస చేస్తారు” అన్నారు.
13
అందుకు ఆయన, “మీరే వారికి ఏదైనా తినడానికి ఇవ్వండి!” అని జవాబిచ్చారు. అందుకు వారు, “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వీరికందరికి పెట్టాలంటే మనం వెళ్లి భోజనం కొని తీసుకురావాలి” అన్నారు.
14
ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు అక్కడ ఉన్నారు. అయినా ఆయన తన శిష్యులతో, “వారందరిని యాభైమంది చొప్పున గుంపులుగా కూర్చోబెట్టండి” అని చెప్పారు.
15
వారు అలానే చేసి, వారందరిని కూర్చోబెట్టారు.
16
అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి వాటిని విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు.
17
వారందరు తిని తృప్తి పొందారు, తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.
Settings