Skip to content
లూకా 7:24-35

లూకా 7:24-35

24
యోహాను శిష్యులు వెళ్లిపోయిన తర్వాత, యేసు యోహానును గురించి జనసమూహంతో ఈ విధంగా చెప్పారు: “ఏమి చూడడానికి మీరు అరణ్యంలోనికి వెళ్లారు? గాలికి ఊగే రెల్లునా?
25
అది కాకపోతే, మరి ఏమి చూడడానికి వెళ్లారు? విలువైన వస్త్రాలను ధరించిన ఒక వ్యక్తినా? కాదు, విలువైన వస్త్రాలను ధరించి విలాసవంతంగా జీవించేవారు రాజభవనాల్లో ఉంటారు.
26
అయితే ఏమి చూడడానికి మీరు వెళ్లారు? ఒక ప్రవక్తనా? అవును, ప్రవక్తకంటే కూడా గొప్పవాడు అని మీతో చెప్తున్నాను.
27
వాక్యంలో ఇతని గురించే ఈ విధంగా వ్రాయబడింది: “ ‘ఇదిగో, నీకు ముందుగా నా దూతను పంపుతాను, అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.’
28
స్త్రీలకు పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు; అయినప్పటికీ, దేవుని రాజ్యంలో అందరికంటే అల్పమైనవాడు అతనికంటే గొప్పవాడని, నేను చెప్తున్నాను” అన్నారు.
29
ప్రజలందరు, పన్ను వసూలు చేసేవారితో సహా అంతా యేసు మాటలు విని, దేవుని మార్గం సరియైనది అని ఒప్పుకున్నారు. ఎందుకంటే వారు యోహాను చేత బాప్తిస్మం పొందుకున్నారు.
30
పరిసయ్యులు ధర్మశాస్త్ర ప్రావీణ్యులు యోహాను చేత బాప్తిస్మం పొందక, తమ పట్ల దేవుని ఉద్దేశాన్ని నిరాకరించారు.
31
యేసు ఇంకా మాట్లాడుతూ, “మరి, ఈ తరం వారిని నేను దేనితో పోల్చాలి? వారు ఎలాంటివారు?
32
వారు వీధిలో ఆడుకుంటూ చాడీలు చెప్పుకునే చిన్న పిల్లల్లాంటివారు: “ ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి వాయించాం, కాని మీరు నాట్యం చేయలేదు; మేము విషాద గీతం పాడాం, కాని మీరు ఏడవలేదు.’
33
ఎందుకంటే బాప్తిస్మమిచ్చే యోహాను రొట్టెలు తినలేదు ద్రాక్షరసం త్రాగలేదు అయినా మీరు, ‘వీడు దయ్యం పట్టినవాడు’ అంటున్నారు.
34
మరోవైపు మనుష్యకుమారుడు తింటున్నాడు త్రాగుతున్నాడు కాబట్టి మీరు, ‘ఇదిగో తిండిబోతు, త్రాగుబోతు, పన్ను వసూలు చేసేవారికి, పాపులకు స్నేహితుడు’ అంటున్నారు.
35
కాని జ్ఞానం సరియైనదని దాని పిల్లలందరిని బట్టే నిరూపించబడుతుంది.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options