Skip to content
యోహాను 6:25-59

యోహాను 6:25-59

25
వారు ఆయనను సరస్సు అవతలి ఒడ్డున చూసినప్పుడు, “రబ్బీ, నీవు ఇక్కడకు ఎప్పుడు వచ్చావు?” అని వారు ఆయనను అడిగారు.
26
అందుకు యేసు వారితో, “మీరు రొట్టెలు తిని తృప్తి పొందారు కాబట్టి నన్ను వెదుకుతున్నారు తప్ప నేను చేసిన అద్భుత కార్యాలను చూసినందుకు కాదని నేను మీతో చెప్పేది నిజము.
27
మీరు పాడైపోయే ఆహారం కోసం కష్టపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచి ఉండే ఆహారం కోసం కష్టపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేశారు” అని చెప్పారు.
28
అప్పుడు వారు ఆయనను, “దేవుని పనులను చేయడానికి మేమేమి చేయాలి?” అని అడిగారు.
29
అందుకు యేసు, “ఆయన పంపినవానిని నమ్మడమే దేవుని పని” అని చెప్పారు.
30
కాబట్టి వారు, “మేము చూసి నిన్ను నమ్మడానికి నీవు ఏ అద్భుత కార్యాన్ని చేస్తున్నావు? ఏమి చేస్తావు?
31
మన పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారని, ‘తినడానికి వారికి పరలోకం నుండి ఆహారం ఇచ్చారు’ అని వ్రాయబడి ఉంది కదా!” అని ఆయనను అడిగారు.
32
యేసు వారితో, “నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను, మీకు పరలోకం నుండి ఆహారం ఇచ్చింది మోషే కాదు, పరలోకం నుండి నా తండ్రే నిజమైన ఆహారం మీకిస్తారు.
33
ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవం ఇచ్చేది దేవుడు ఇచ్చే ఆహారమని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు.
34
అందుకు వారు, “అయ్యా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడు ఇవ్వు” అన్నారు.
35
అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు.
36
అయితే నేను మీకు చెప్పిన రీతిగానే మీరు నన్ను చూసి కూడా నమ్మలేదు.
37
తండ్రి నాకు ఇచ్చే వారందరు నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చేవారిని నేను ఎప్పుడు త్రోసివేయను.
38
ఎందుకంటే నేను నాకిష్టమైనది చేయడానికి పరలోకం నుండి దిగిరాలేదు కానీ నన్ను పంపినవానికి ఇష్టమైనది చేయడానికే వచ్చాను.
39
ఆయన నాకిచ్చిన వారిలో ఎవరినీ పోగొట్టుకోకుండా, చివరి రోజున వారిని జీవంతో లేపడం నన్ను పంపినవాని చిత్తమై ఉంది.
40
కుమారుని చూసి ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందాలనేది నా తండ్రి చిత్తమై ఉంది. వారిని చివరి రోజున జీవంతో నేను లేపుతాను.”
41
“పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే” అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనపై సణుగుకోవడం మొదలుపెట్టారు.
42
వారు, “ఈ యేసు యోసేపు కుమారుడు కాడా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలియదా? ‘నేను పరలోకం నుండి దిగి వచ్చాను’ అని ఎలా చెప్తున్నాడు?” అని చెప్పుకున్నారు.
43
యేసు, “మీలో మీరు సణుగుకోవడం ఆపండి” అన్నారు.
44
ఇంకా మాట్లాడుతూ, “నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరూ నా దగ్గరకు రాలేరు, చివరి రోజున నేను వారిని జీవంతో లేపుతాను.
45
‘దేవుడు వారందరికి బోధిస్తారు’ అని ప్రవక్తలచే వ్రాయబడిన విధంగా, తండ్రి మాటలను విని ఆయన నుండి నేర్చుకున్న ప్రతిఒక్కరు నా దగ్గరకు వస్తారు.
46
దేవుని నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవరు తండ్రిని చూడలేదు; ఆయన మాత్రమే తండ్రిని చూశారు
47
నమ్మినవారే నిత్యజీవాన్ని కలిగి ఉంటాడని నేను మీతో చెప్పేది నిజము.
48
జీవాహారం నేనే.
49
మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయారు.
50
అయితే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇక్కడ ఉంది. దీన్ని తినే వారెవరు చనిపోరు.
51
పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని జీవింపచేసే ఈ జీవాహారం నా శరీరమే” అని చెప్పారు.
52
అందుకని యూదులు తమలో తాము, “ఈయన తన శరీరాన్ని మనం తినడానికి ఎలా ఇవ్వగలడు?” అని తీవ్రంగా వాదించుకోవడం మొదలుపెట్టారు.
53
అందుకు యేసు వారితో, “నేను మీతో చెప్పేది నిజం, మీరు మనుష్యకుమారుని శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగితేనే తప్ప మీలో జీవం ఉండదు.
54
నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగినవారు నిత్యజీవం కలిగి ఉంటారు. చివరి రోజున నేను వానిని జీవంతో లేపుతాను.
55
నా శరీరం నిజమైన ఆహారం నా రక్తం నిజమైన పానీయము.
56
నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని త్రాగినవారు నాలో నిలిచి ఉంటారు, అలాగే నేను వారిలో నిలిచి ఉంటాను.
57
సజీవుడైన తండ్రి నన్ను పంపినందుకు నేను తండ్రి వలననే జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవారు నా వలన జీవిస్తారు.
58
పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఇదే. మీ పితరులు మన్నాను తిని చనిపోయారు కాని ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు” అని చెప్పారు.
59
కపెర్నహూములోని సమాజమందిరంలో బోధిస్తూ యేసు ఈ మాటలను చెప్పారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options