Skip to content
యిర్మీయా 51:11-34

యిర్మీయా 51:11-34

11
“బాణాలకు పదును పెట్టండి, కవచాలను తీసుకోండి! యెహోవా మాదీయుల రాజులను రెచ్చగొట్టారు, ఎందుకంటే బబులోనును నాశనం చేయడమే ఆయన ఉద్దేశము. యెహోవా ప్రతీకారం తీర్చుకుంటారు, తన మందిరం కోసం ప్రతీకారం తీర్చుకుంటారు.
12
బబులోను గోడలకు వ్యతిరేకంగా జెండా ఎత్తండి! రక్షకభటులను బలపరచండి, కావలివారిని నిలబెట్టండి, మాటుగాండ్రను సిద్ధం చేయండి! యెహోవా తన ఉద్దేశాన్ని, బబులోను ప్రజలకు వ్యతిరేకంగా తన శాసనాన్ని నెరవేర్చబోతున్నారు.
13
అనేక జలాల ప్రక్కన నివసించేదానా, సమృద్ధి సంపదలు కలిగి ఉన్నదానా, నీ అంతం వచ్చింది, నీవు నాశనమయ్యే సమయం వచ్చింది.
14
సైన్యాల యెహోవా తన జీవం తోడని ప్రమాణం చేశారు: మిడతల దండులా నేను నిన్ను నిశ్చయంగా మనుష్యులతో నింపుతాను, వారు నీపై విజయ కేకలు వేస్తారు.
15
“ఆయన తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.
16
ఆయన ఉరిమినప్పుడు, ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.
17
“మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. అతడు చేసే చిత్రాలు మోసం; వాటిలో ఊపిరి లేదు.
18
అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.
19
యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు, ఆయన పేరు సైన్యాల యెహోవా.
20
“నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు, యుద్ధ ఆయుధంవంటివాడవు నీతో నేను దేశాలను చిన్నాభిన్నం చేస్తాను, నీతో రాజ్యాలను నాశనం చేస్తాను,
21
నీతో నేను గుర్రాన్ని రౌతును చిన్నాభిన్నం చేస్తాను, నీతో నేను రథాన్ని సారథిని చిన్నాభిన్నం చేస్తాను,
22
నీతో పురుషున్ని స్త్రీని చిన్నాభిన్నం చేస్తాను, నీతో వృద్ధులను చిన్నవారిని చిన్నాభిన్నం చేస్తాను, నీతో యువకులను యువతులను చిన్నాభిన్నం చేస్తాను,
23
నీతో గొర్రెల కాపరిని మందను చిన్నాభిన్నం చేస్తాను, నీతో రైతును ఎద్దులను చిన్నాభిన్నం చేస్తాను, నీతో అధిపతులను అధికారులను చిన్నాభిన్నం చేస్తాను.
24
“బబులోనుకు, బబులోనులో నివసించే వారందరికి సీయోనులో చేసిన అన్యాయానికి బదులుగా మీ కళ్లముందే నేను ప్రతిఫలం చెల్లిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
25
“నాశనం చేసే పర్వతమా, భూమి అంతటిని నాశనం చేసేదానా, నేను నీకు వ్యతిరేకిని,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీకు వ్యతిరేకంగా నా చేయి చాపి, నిన్ను కొండలమీద నుండి దొర్లించి, నిన్ను కాలిపోయిన పర్వతంలా చేస్తాను.
26
ప్రజలు నీ నుండి మూలరాయిని గాని, పునాది రాయిని గాని తీసుకోరు, ఎందుకంటే నీవు శాశ్వతంగా నిర్జనమై ఉంటావు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
27
“దేశంలో ఒక జెండా ఎత్తండి! దేశాల మధ్య బాకా ఊదండి! దానితో యుద్ధానికి జనాలను సిద్ధపరచండి; దాని మీద దాడి చేయడానికి: అరారతు, మిన్ని అష్కెనజు. దానికి వ్యతిరేకంగా సేనాధిపతిని నియమించండి; మిడతల దండులా గుర్రాలను పంపండి.
28
మాదీయుల రాజులను, వారి అధిపతులను, వారి అధికారులందరిని, వారు పాలించే అన్ని దేశాలను దాని మీదికి యుద్ధానికి సిద్ధపరచండి.
29
భూమి వణుకుతుంది, ప్రసవ వేదన పడుతుంది, బబులోను దేశాన్ని పాడు చేయాలని అక్కడ ఎవరూ నివసించకుండ చేయాలని యెహోవా ఉద్దేశాలలో మార్పు లేదు.
30
బబులోను యోధులు యుద్ధం ఆపివేశారు; వారు తమ కోటల్లోనే ఉంటారు. వారి బలం సమసిపోయింది; వారు బలహీనులయ్యారు. దాని నివాసాలకు నిప్పు పెట్టారు; దాని ద్వారబంధాలు విరిగిపోయాయి.
31
అతని పట్టణమంతా స్వాధీనం చేసుకోబడిందని బబులోను రాజుకు తెలియజేయడానికి, ఒక వార్తాహరుని వెంట మరో వార్తాహరుడు, ఒక దూత వెంట మరో దూత పరుగు పెడుతున్నారు.
32
నదుల రేవులను ఆక్రమించబడ్డాయి. చిత్తడి నేలలకు నిప్పంటించబడింది, సైనికులు భయభ్రాంతులకు గురయ్యారు.”
33
ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “బబులోను కుమార్తె నూర్పిడి కళ్ళంలా ఉంది దాన్ని నూర్పిడి సమయం ఇదే; త్వరలో దాని కోతకాలం వస్తుంది.”
34
“బబులోను రాజైన నెబుకద్నెజరు మనల్ని మ్రింగివేశాడు, మనల్ని గందరగోళంలో పడేశాడు, మనల్ని ఖాళీ కుండలా చేశాడు. ఘటసర్పంలా మనల్ని మ్రింగివేసి మన రుచికరమైన పదార్ధాలతో తన కడుపు నింపుకొని తర్వాత మనల్ని ఉమ్మివేశాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options