యిర్మీయా 38:14-28
14
అప్పుడు రాజైన సిద్కియా యిర్మీయా ప్రవక్తను పిలిపించి, యెహోవా మందిరంలోని మూడవ ద్వారం దగ్గరకు అతన్ని రప్పించాడు. రాజు యిర్మీయాతో, “నేను నిన్ను ఒక విషయం అడుగుతున్నాను; నా దగ్గర ఏమీ దాచకుండ జవాబివ్వాలి” అని అన్నాడు.
15
అందుకు యిర్మీయా సిద్కియాతో, “ఒకవేళ నేను మీరు నిజం చెబితే, మీరు నన్ను చంపరా? నేను ఒకవేళ మీకు సలహా ఇచ్చినా మీరు నా మాట వినరు.”
16
అయితే సిద్కియా రాజు యిర్మీయాతో రహస్యంగా ఈ ప్రమాణం చేశాడు: “మనకు ఊపిరినిచ్చే, సజీవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్న, నిన్ను నేను చంపను, నిన్ను చంపాలనుకున్న వారికి అప్పగించను.”
17
అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: ‘నీవు బబులోను రాజు అధికారులకు లొంగిపోతే, నీ ప్రాణం దక్కుతుంది, ఈ పట్టణం కూడా అగ్నితో కాల్చివేయబడదు; నీవు, నీ కుటుంబం బ్రతుకుతారు.
18
అయితే ఒకవేళ నీవు బబులోను రాజు అధికారులకు లొంగిపోకపోతే, ఈ పట్టణం బబులోనీయుల చేతులకు అప్పగించబడుతుంది, వారు దానిని కాల్చివేస్తారు; అప్పుడు కనీసం నీవు కూడా వారి నుండి తప్పించుకోలేవు.’ ”
19
సిద్కియా రాజు యిర్మీయాతో, “బబులోనీయుల దగ్గరకు వెళ్లిపోయిన యూదుల గురించి నేను భయపడుతున్నాను, ఎందుకంటే బబులోనీయులు నన్ను వారి చేతికి అప్పగిస్తే, వారు నన్ను ఘోరంగా అవమానిస్తారు” అని అన్నాడు.
20
“వారు మిమ్మల్ని అప్పగించరు; నేను చెప్పేది చేస్తూ యెహోవాకు లోబడండి. అప్పుడు అది మీకు అంతా మంచే జరుగుతుంది, మీరు ప్రాణాలతో ఉంటారు” అని యిర్మీయా జవాబిచ్చాడు.
21
కానీ మీరు లొంగిపోవడానికి నిరాకరిస్తే, యెహోవా నాకు ఇలా తెలియజేశారు:
22
యూదారాజు యొక్క రాజభవనంలో మిగిలి ఉన్న స్త్రీలందరినీ బబులోను రాజు యొక్క అధికారుల దగ్గరికి తీసుకువస్తారు. అప్పుడు ఆ స్త్రీలు నిన్ను చూసి వెటకారంగా ఇలా అంటారు: “ ‘మీ నమ్మకమైన స్నేహితులు మిమ్మల్ని తప్పుదారి పట్టించారు, వారు మిమ్మల్ని అప్పగించారు. మీ పాదాలు బురదలో దిగబడినప్పుడు; మీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారు.’
23
“మీ భార్యాపిల్లలందరూ బబులోనీయుల దగ్గరికి రప్పించబడతారు. స్వయంగా మీరే వారి చేతుల నుండి తప్పించుకోలేరు; మీరు బబులోను రాజు చేత బంధించబడతారు; ఈ పట్టణం కాల్చివేయబడుతుంది.”
24
అప్పుడు సిద్కియా యిర్మీయాతో, “ఈ సంభాషణ గురించి ఎవరికీ తెలియకూడదు, తెలిస్తే నీవు చస్తావు.
25
నేను నీతో మాట్లాడానని అధికారులు విని, నీ దగ్గరికి వచ్చి, ‘మీరు రాజుతో ఏం మాట్లాడారో, రాజు మీతో ఏం మాట్లాడారో మాకు చెప్పండి. మా దగ్గర దాచవద్దు, లేకుంటే మేము మిమ్మల్ని చంపుతాము’
26
అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘నన్ను యోనాతాను ఇంటికి తిరిగి పంపించవద్దని రాజు దగ్గర విన్నవించుకున్నాను.’ ”
27
అధికారులందరూ యిర్మీయా దగ్గరకు వచ్చి అతన్ని ప్రశ్నించగా, అతడు రాజు వారితో చెప్పమని తనకు ఆదేశించినదంతా చెప్పాడు. కాబట్టి వారు అతనితో ఇంకేమి అనలేదు, ఎందుకంటే రాజుతో అతనికి ఏమి సంభాషణ జరిగిందో ఎవరూ వినలేదు.
28
యెరూషలేము స్వాధీనమైపోయిన రోజు వరకు యిర్మీయా, కావలివారి ప్రాంగణంలోనే ఉన్నాడు. యెరూషలేము ఈ విధంగా ఆక్రమించబడింది:
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.