యిర్మీయా 10:1-16
1
ఇశ్రాయేలు ప్రజలారా! యెహోవా మీతో మాట్లాడుతున్నారు, వినండి.
2
యెహోవా ఇలా చెప్తున్నారు: “ఇతర దేశాల విధానాలను నేర్చుకోవద్దు ఆకాశంలో సూచనలను చూసి అవి భయపడినా, మీరు భయపడవద్దు.
3
ఎందుకంటే జనాంగాల ఆచారాలు విలువలేనివి; వారు అడవిలో చెట్టు నరికి తెస్తారు, హస్తకళాకారుడు ఉలితో చెక్కుతాడు.
4
వారు వెండి బంగారాలతో వాటిని అలంకరిస్తారు; కదలకుండా ఉండేలా, సుత్తితో మేకులు కొట్టి దానిని బిగిస్తారు.
5
దోసకాయ పొలంలో దిష్టిబొమ్మలా, వారి విగ్రహాలు మాట్లాడలేవు; అవి నడవలేవు కాబట్టి వాటిని మోయాలి. వాటికి భయపడవద్దు; అవి ఏ హాని చేయలేవు అలాగే ఏ మేలు కూడా చేయలేవు.”
6
యెహోవా, మీలాంటి వారు ఎవరు లేరు; మీరు గొప్పవారు, మీ నామం ఘనమైనది.
7
దేశాలకు మీరు రాజు, మిమ్మల్ని గౌరవించని వాడెవడు? గౌరవం మీకు చెందినదే. దేశాలకు చెందిన జ్ఞానులైన నాయకులందరిలో వారి రాజ్యాలన్నిటిలో, మీలాంటి వారెవ్వరూ లేరు.
8
వారంతా తెలివిలేనివారు, మూర్ఖులు; వారు పనికిరాని చెక్క విగ్రహాల బోధను వింటున్నారు.
9
తర్షీషు నుండి సాగగొట్టబడిన వెండి ఊఫజు నుండి బంగారం తీసుకురాబడ్డాయి. హస్తకళాకారుడు, కంసాలివాడు తయారుచేసిన వాటికి నీలం, ఊదా రంగుల వస్త్రాలు ధరింపచేశారు, అవన్నీ నైపుణ్యం కలిగిన పనివారిచేత తయారుచేయబడ్డాయి.
10
అయితే యెహోవాయే నిజమైన దేవుడు; ఆయన సజీవుడైన దేవుడు, నిత్య రాజు. ఆయనకు కోపం వచ్చినప్పుడు, భూమి కంపిస్తుంది; ఆయన ఉగ్రతను దేశాలు సహించలేవు.
11
“వారితో ఇలా చెప్పు: ‘ఆకాశాన్ని, భూమిని సృజించని ఈ దేవుళ్ళు భూమి మీద నుండి, ఆకాశం క్రిందనుండి నశించిపోతారు.’ ”
12
అయితే దేవుడు తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.
13
ఆయన ఉరిమినప్పుడు ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.
14
మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. అతడు చేసే చిత్రాలు మోసం; వాటిలో ఊపిరి లేదు.
15
అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.
16
యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు. ఆయన పేరు సైన్యాల యెహోవా.
Settings