యెషయా 44:13-20
13
వడ్రంగి నూలు త్రాడుతో కొలతలు వేసి రూపం యొక్క రూపురేఖలను గుర్తిస్తాడు; అతడు ఉలితో దానిని చెక్కి దిక్సూచితో గుర్తులు పెడతాడు. క్షేత్రంలో అది ఉండడానికి దానికి నర రూపాన్ని ఇచ్చి నర సౌందర్యం కలదానిగా తయారుచేస్తాడు.
14
అతడు దేవదారు చెట్లను నరుకుతాడు సరళ వృక్షాన్ని గాని సింధూర వృక్షాన్ని గాని తీసుకుంటాడు. అతడు అడవి చెట్ల మధ్యలో దానిని ఎదిగేటట్లు చేస్తాడు, దేవదారు చెట్టు నాటుతాడు, వర్షం దానిని పెంచుతుంది.
15
ఒక మనుష్యుడు దాని కట్టెలను మంట పెట్టడానికి ఉపయోగిస్తాడు; అతడు ఆ కట్టెలలో కొన్ని తీసుకుని చలి కాచుకుంటాడు, అవే కట్టెలతో అతడు నిప్పు రాజేసి రొట్టె కాల్చుకుంటాడు. మిగిలిన కర్రతో ఒక దేవున్ని చేసికొని దానిని పూజిస్తాడు; దానితో ఒక విగ్రహాన్ని చేసి దానికి నమస్కారం చేస్తాడు.
16
సగం కట్టెలను నిప్పుతో కాల్చి ఆ కట్టెల మీద తన ఆహారం వండుకుంటాడు. దానిపై అతడు మాంసం వండుకుని తృప్తిగా తింటాడు. అంతేకాదు, అతడు చలి కాచుకుంటూ, “ఆహా! నాకు వెచ్చగా ఉంది; నాకు మంట కనబడుతుంది” అని అనుకుంటాడు.
17
మిగిలిన దానితో అతడు తనకు దేవునిగా ఒక విగ్రహాన్ని చేసుకుంటాడు. అతడు దానికి నమస్కారం చేసి పూజిస్తాడు. “నీవే నా దేవుడవు! నన్ను రక్షించు!” అని దానికి ప్రార్థిస్తాడు.
18
ఈ మనుష్యులకు ఏమీ తెలియదు, దేన్ని గ్రహించరు; చూడకుండ వారి కళ్లు కప్పబడ్డాయి, గ్రహించకుండా వారి మనస్సులు మూయబడ్డాయి.
19
ఎవరూ ఆలోచించడం లేదు, “దీనిలో సగం ఇంధనంగా వాడాను; దాని నిప్పుల మీద రొట్టె కూడా కాల్చాను, నేను మాంసం వండుకుని తిన్నాను. నేను మిగిలిన దానితో అసహ్యమైన దానిని చేయాలా? నేను చెట్టు మొద్దుకు నమస్కారం చేయాలా?” అని ఆలోచించడానికి ఎవరికీ తెలివి గాని వివేచన గాని లేదు.
20
అలాంటివాడు బూడిద తింటాడు; మోసపూరితమైన హృదయం అతన్ని దారి తప్పిస్తుంది; తనను తాను రక్షించుకోలేడు, “నా కుడి చేతిలో ఉన్నది అబద్ధం కాదా?” అని అనలేడు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings