Skip to content
హోషేయ 2:1-14

హోషేయ 2:1-14

1
“మీరు మీ సోదరులతో, ‘మీరు నా ప్రజలు’ అని, మీ సహోదరీలతో, ‘నా ప్రియమైన వారలారా’ అని అనండి.
2
“మీ తల్లిని గద్దించండి, గద్దించండి, ఆమె నా భార్య కాదు, నేను ఆమె భర్తను కాను. ఆమె తన వ్యభిచార చూపును మానుకోవాలి, తన రొమ్ముల మధ్య నుండి పరపురుషులను తొలగించాలి.
3
లేకపోతే ఆమెను దిగంబరిని చేస్తాను, ఆమె బట్టలు తీసివేసి ఆమె పుట్టిన రోజున ఉన్నట్లు ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమెను ఎడారిలా చేస్తాను, ఎండిపోయిన భూమిలా చేస్తాను దప్పికతో ఆమె చచ్చునట్లు చేస్తాను.
4
ఆమె పిల్లల మీద నా ప్రేమను చూపించను, ఎందుకంటే, వారు వ్యభిచారం వలన పుట్టిన పిల్లలు.
5
వారి తల్లి వ్యభిచారం చేసింది, అవమానంలో వారిని కన్నది. ఆమె, ‘నేను నా ప్రేమికుల వెంట వెళ్తాను, వారు నాకు నా ఆహారం, నీళ్లు, ఉన్ని, జనపనార, ఒలీవనూనె, పానీయం ఇస్తారు’ అన్నది.
6
కాబట్టి ముళ్ళపొదలను ఆమె దారిని అడ్డుగా వేస్తాను; ఆమె తన దారి కనబడకుండ నేను గోడ కడతాను.
7
ఆమె తన ప్రేమికుల వెంటపడుతుంది కాని వారిని కలుసుకోలేదు; ఆమె వారిని వెదుకుతుంది కాని వారు కనబడరు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ‘నేను నా మొదటి భర్త దగ్గరకు తిరిగి వెళ్తాను, ఇప్పటి కంటే అప్పుడే నా స్థితి బాగుండేది.’
8
ఆమెకు ధాన్యం, నూతన ద్రాక్షరసం, నూనె, విస్తారమైన వెండి, బంగారాలు, ఇచ్చింది నేనే అని ఆమె గుర్తించలేదు, వాటిని బయలు కోసం వాడింది.
9
“కాబట్టి కోతకాలంలో నా ధాన్యం నేను తీసివేస్తాను, ద్రాక్షరసం సిద్ధంగా ఉన్నప్పుడు దానిని తీసివేస్తాను. ఆమె దిగంబరత్వాన్ని కప్పుకోడానికి నేను ఇచ్చిన నా ఉన్నిని, నా జనపనారను తిరిగి తీసుకుంటాను.
10
కాబట్టి ఇప్పుడు ఆమె ప్రేమికుల కళ్లెదుట, ఆమె కామాతురతను బయటపెడతాను, ఆమెను నా చేతిలో నుండి ఎవ్వరూ విడిపించలేరు.
11
ఆమె ఉత్సవ వేడుకలన్నిటిని: ఆమె వార్షిక పండుగలు, అమావాస్యలు, ఆమె సబ్బాతు దినాలు అన్ని ఆగిపోయేలా చేస్తాను.
12
తన ప్రేమికులు తనకు ఇచ్చిన జీతం అని ఆమె చెప్పుకునే, ఆమె ద్రాక్షలను అంజూర చెట్లను నేను పాడుచేస్తాను; వాటిని దట్టమైన అడవిగా మారుస్తాను, అడవి జంతువులు వాటిని తినివేస్తాయి.
13
ఆమె బయలులకు ధూపం వేసిన రోజుల గురించి, నేను ఆమెను శిక్షిస్తాను; ఆమె నగలు ఆభరణాలతో అలంకరించుకుని, తన ప్రేమికుల వెంట వెళ్లిపోయింది, కాని నన్ను మరచిపోయింది” అని యెహోవా చెప్తున్నారు.
14
కాబట్టి ఆమెను ఆకర్షించబోతున్నాను; నేను ఆమెను అరణ్యంలోకి నడిపించి, ఆమెతో మృదువుగా మాట్లాడతాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options