దానియేలు 11:6-14
6
కొన్ని సంవత్సరాలకు వారిద్దరు మిత్రులవుతారు. అంతేగాక దక్షిణ రాజు కుమార్తె ఉత్తర రాజుతో సంబంధాలు సరిచేయడానికి అతని దగ్గరకు వెళ్తుంది, కాని ఆమె అతని మీద తన ప్రభావాన్ని నిలుపుకోదు, అతడు, అతని అధికారం నిలువదు. ఆ రోజుల్లో ఆమె, ఆమె రాజ అంగరక్షకులు, ఆమె తండ్రి, ఆమెకు సహాయపడినవాడు తృణీకరించబడతారు.
7
“ఆమె కుటుంబ వంశం నుండి ఆమెకు బదులు ఒకడు లేస్తాడు. అతడు ఉత్తరాది రాజు యొక్క బలగాలపై దాడి చేసి అతని కోటలో చొరబడతాడు; అతడు వారి మీద యుద్ధం చేసి గెలుస్తాడు.
8
అతడు వారి దేవుళ్ళను, వారి పోతవిగ్రహాలను, వారి విలువైన వెండి బంగారు వస్తువులను పట్టుకుని ఈజిప్టుకు తీసుకెళ్తాడు. కొన్ని సంవత్సరాలు అతడు ఉత్తరాది రాజును ఒంటరిగా వదిలేస్తాడు.
9
తర్వాత ఉత్తరాది రాజు దక్షిణాది రాజు దేశంలోకి దండెత్తి వస్తాడు కాని, తిరిగి స్వదేశానికి వెళ్లిపోతాడు.
10
అతని కుమారులు యుద్ధానికి సిద్ధపడి, గొప్ప సైన్యాన్ని సమకూరుస్తారు, అది ఆగలేని వరదలా ముందుకు వస్తూ, అతని కోట వరకు యుద్ధాన్ని తీసుకెళ్తుంది.
11
“అప్పుడు దక్షిణాది రాజు కోపంతో గొప్ప సైన్యాన్ని పురికొల్పిన ఉత్తరాది రాజు మీదికి దండెత్తి వస్తాడు, వారిని ఓడిస్తాడు.
12
ఆ సైన్యాన్ని పట్టుకెళ్లిన తర్వాత, దక్షిణాది రాజు గర్వంతో నిండి, వేలమందిని చంపేస్తాడు, అయినా అతని విజయం నిలువదు.
13
ఎందుకంటే ఉత్తరాది రాజు మరో సైన్యాన్ని సిద్ధం చేస్తాడు, అది ముందున్న దానికంటే గొప్పది; కొన్ని సంవత్సరాల తర్వాత, పూర్తిగా సిద్ధం చేయబడిన మహా సైన్యంతో అతడు తిరిగి వస్తాడు.
14
“ఆ రోజుల్లో చాలామంది దక్షిణాది రాజు మీదికి లేస్తారు. నీ సొంత ప్రజల్లో హింసాత్మకమైన వారు దర్శనం నెరవేర్పులో భాగంగా తిరగబడతారు, కాని విఫలమవుతారు.
Settings