అపొస్తలుల కార్యములు 3:1-11
1
ఒక రోజు పేతురు యోహానులు మధ్యాహ్నం మూడు గంటల వేళలో ప్రార్థన సమయానికి దేవాలయానికి వెళ్తున్నారు.
2
సుందరమని పిలువబడే ఆ దేవాలయ గుమ్మం దగ్గర కూర్చుని, ఆవరణంలోనికి వచ్చేవారి దగ్గర భిక్షం అడుక్కోడానికి పుట్టుకతోనే కుంటివాడైన ఒకనిని ప్రతిరోజు కొంతమంది మోసుకొచ్చేవారు.
3
పేతురు యోహానులు ఆ దేవాలయ ఆవరణంలోనికి ప్రవేశిస్తుండగా వాడు చూసి భిక్షమడిగాడు.
4
యోహాను చేసినట్టుగానే, పేతురు వానివైపు సూటిగా చూసి, వానితో, “మా వైపు చూడు!” అన్నాడు.
5
వాడు వారి దగ్గర ఏమైన దొరుకుతుందేమోనని ఆశిస్తూ, వారివైపు దీక్షగా చూశాడు.
6
అప్పుడు పేతురు వానితో, “వెండి బంగారాలు నా దగ్గర లేవు గాని, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు పేరట లేచి నడువు” అని చెప్పి,
7
వాని కుడిచేయి పట్టుకుని లేపాడు. వెంటనే వాని పాదాలు, చీలమండలాలు బలం పొందుకున్నాయి.
8
వాడు లేచి ఎగిరి తన కాళ్లపై నిలబడి నడవడం మొదలుపెట్టాడు. తర్వాత వాడు నడుస్తూ, గంతులు వేస్తూ, దేవుని స్తుతిస్తూ వారితో పాటు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు.
9
ప్రజలందరు అతడు నడుస్తూ దేవుని స్తుతిస్తున్నాడని చూసి,
10
సుందరమని పిలువబడే ఆ దేవాలయ గుమ్మం దగ్గర కూర్చుని భిక్షమడిగేవాడు వీడే అని గుర్తించి, వానికి జరిగిన దానిని బట్టి విస్మయం చెంది ఆశ్చర్యపడ్డారు.
11
స్వస్థత పొందినవాడు పేతురు యోహానులతో ఉండగా, ప్రజలందరు ఆశ్చర్యపడి, సొలొమోను మండపం అని పిలువబడే చోటికి గుంపులుగా పరుగెత్తుకొని వచ్చారు.
Settings