Skip to content
అపొస్తలుల కార్యములు 15:7-21

అపొస్తలుల కార్యములు 15:7-21

7
చాలా చర్చలు జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లన్నాడు: “సహోదరులారా, కొంతకాలం క్రిందట యూదేతరులు నా నోట సువార్త సందేశం విని విశ్వసించాలని మీలో నుండి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని మీకు తెలుసు కదా!
8
హృదయాలను ఎరిగిన దేవుడు, ఆయన మన పట్ల చేసినట్టుగానే, వారికి కూడా పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా ఆయన వారిని స్వీకరించాడని నిరూపించారు.
9
దేవుడు మనకు వారికి మధ్య ఏ భేదం చూపించకుండ వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచారు.
10
కాబట్టి ఇప్పుడు, మన పితరులు కానీ మనం కానీ మోయలేని కాడిని యూదేతరులలో నుండి వచ్చిన విశ్వాసుల మెడ మీద పెట్టి దేవుని శోధించవచ్చా? అలా చేయకూడదు!
11
వారు రక్షణ పొందినట్లే, ప్రభువైన యేసు కృప చేతనే మనం కూడా రక్షణ పొందుకుంటున్నామని నమ్ముతున్నాం కదా.”
12
బర్నబా పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరుల మధ్యలో చేసిన అద్భుతాలను సూచకక్రియలను ఆ సభలో వివరిస్తున్నప్పుడు అక్కడ చేరిన వారందరు శ్రద్ధతో నిశ్శబ్దంగా విన్నారు.
13
వారు చెప్పడం ముగించిన తర్వాత, యాకోబు లేచి ఈ విధంగా చెప్పాడు: “సహోదరులారా, నా మాట వినండి.
14
యూదేతరులలో నుండి దేవుడు తన నామము కోసం ప్రజలను ఏర్పరచుకోడానికి తానే మొదట ఎలా జోక్యం చేసుకున్నాడో సీమోను వివరించాడు.
15
దీనిని గురించి ప్రవక్తల మాటలు కూడా ఏకీభవిస్తున్నాయి, ఎలాగంటే:
16
“ ‘ఆ తర్వాత నేను తిరిగివచ్చి, పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతాను. దాని శిథిలాలను తిరిగి నిర్మిస్తాను, దానిని పునరుద్ధరిస్తాను,
17
అప్పుడు మిగిలిన వారందరు, నా నామం ధరించిన యూదేతరులు కూడ దేవుని వెదకేలా చేస్తాను, అని పూర్వం నుండి తెలియచేయబడిన ఈ కార్యములను,
18
చేస్తున్న ప్రభువు చెప్తున్నాడు.’
19
“కాబట్టి, దేవుని వైపు తిరుగుతున్న యూదేతరులకు మనం కష్టంగా ఉండేలా చేయకూడదనేది నా తీర్పు.
20
దానికి బదులుగా, విగ్రహాలకు అర్పించి అపవిత్రపరచిన ఆహారాన్ని తినడం, లైంగిక అనైతికత సంబంధాలను, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, రక్తాన్ని తినడం మానుకోవాలని మనం వారికి ఉత్తరం వ్రాసి తెలియచేయాలి.
21
ఎందుకంటే, మోషే ధర్మశాస్త్రాన్ని అనేక తరాల నుండే ప్రతి పట్టణంలోని సమాజమందిరాల్లో ప్రతి సబ్బాతు దినాన చదువుతూ బోధిస్తున్నారు” అని చెప్పాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options