కంటెంట్‌కు వెళ్లండి

ప్రకటన8

ఏడవ ముద్ర మరియు పరలోక నిశ్శబ్దం

1
ఆ వధించబడిన గొర్రెపిల్ల ఏడవ ముద్రను విప్పినప్పుడు అక్కడ పరలోకంలో సుమారు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది.
2
అప్పుడు నేను దేవుని ముందు నిలబడిన ఏడుగురు దేవదూతలను చూశాను, వారికి ఏడు బూరలు ఇవ్వబడ్డాయి.

పరిశుద్ధుల ప్రార్థనలు మరియు తీర్పుకు సిద్ధత

3
ధూపం వేసే బంగారు పాత్రను పట్టుకున్న మరొక దేవదూత వచ్చి బలిపీఠం దగ్గర నిలబడ్డాడు. సింహాసనం ముందు ఉన్న బంగారు బలిపీఠం మీద దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిపి అర్పించడానికి చాలా ధూపద్రవ్యాలు అతనికి ఇవ్వబడ్డాయి.
4
అప్పుడు దూత చేతి నుండి ఆ ధూపద్రవ్యాల పొగ దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిసి పైకి లేచి దేవుని సన్నిధికి చేరింది.
5
ఆ దూత బలిపీఠం నుండి తీసిన అగ్నితో ధూపం వేసే పాత్రను నింపి దాన్ని భూమి మీదికి విసిరివేశాడు. అప్పుడు గర్జన లాంటి శబ్దాలు, ఉరుములు, మెరుపుల ధ్వనులు, భూకంపం వచ్చాయి.
6
అప్పుడు ఏడు బూరలను పట్టుకుని ఉన్న ఆ ఏడు దూతలు వాటిని ఊదడానికి సిద్ధపడ్డారు.

మొదటి నాలుగు బూరల తీర్పులు

7
మొదటి దూత తన బూరను ఊదినప్పుడు రక్తంతో కలిసి ఉన్న అగ్ని వడగండ్లు భూమి మీదికి కురిసాయి. అప్పుడు భూమి మూడవ భాగం, చెట్లలో మూడవ భాగం కాలిపోయింది, పచ్చని గడ్డంతా కాలిపోయింది.
8
రెండవ దూత తన బూరను ఊదినప్పుడు అగ్నితో మండుతున్న పర్వతం లాంటిది సముద్రంలో పడింది. అప్పుడు సముద్రంలోని మూడవ భాగం రక్తంగా మారింది.
9
దానితో సముద్రంలోని ప్రాణుల్లో మూడవ భాగం చనిపోయాయి. ఇంకా ఓడలలో మూడవ భాగం నాశనమయ్యాయి.
10
మూడవ దూత తన బూరను ఊదినప్పుడు దివిటీలా ప్రకాశిస్తున్న ఒక గొప్ప నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీద, నీటి ఊటలలో పడింది.
11
ఆ నక్షత్రం పేరు “చేదు” అది పడినప్పుడు నీటిలో మూడవ భాగం చేదుగా మారింది. ఆ చేదు నీటి వల్ల చాలామంది చనిపోయారు.
12
నాలుగవ దూత తన బూరను ఊదినప్పుడు సూర్యుని మూడవ భాగం, చంద్రుని మూడవ భాగం, నక్షత్రాల మూడవ భాగం దెబ్బతిన్నాయి. కాబట్టి అవన్నీ మూడవ భాగం వెలుగును కోల్పోయాయి. పగటి వెలుగులో మూడవ భాగం ప్రకాశం ఇవ్వలేదు అలాగే రాత్రి మూడవ భాగం వెలుగు లేకుండా పోయింది.

మూడు శ్రమలు ప్రకటించబడుట

13
నేను చూస్తూ ఉండగా ఒక పక్షిరాజు మధ్య ఆకాశంలో ఎగురుతూ పెద్ద స్వరంతో, “అయ్యో, శ్రమ! శ్రమ! మిగతా ముగ్గురు దేవదూతలు బూరల ధ్వని చేయబోతున్నారు కాబట్టి భూనివాసులకు శ్రమ” అని అరుస్తుంటే నేను విన్నాను.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options