Skip to content

హెబ్రీయులకు5

భౌమ ప్రధానయాజకుని అర్హతలు

1
ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఏర్పరచబడి, దేవునికి సంబంధించిన విషయాల్లో ప్రజల ప్రతినిధిగా పాపపరిహార బలులను కానుకలను అర్పించడానికి నియమించబడ్డాడు.
2
తాను కూడా బలహీనతలకు గురైనవానిగా ఉన్నా, అవివేకులైన వారిని దారి తప్పిపోతున్న వారిని దయతో నడిపించగల సమర్ధుడు.
3
ఈ కారణంగా, అతడు తన పాపాల కోసం అలాగే ప్రజల పాపాల కోసం బలి అర్పించాల్సి ఉంది.
4
ఈ గౌరవాన్ని ఎవరు తమంతట తాము పొందలేరు, కాని అహరోను ఎలా పిలువబడ్డాడో అలాగే దేవుని చేత పిలువబడినప్పుడు వారు దానిని పొందుకుంటారు.

క్రీస్తు ప్రధానయాజకునిగా నియమింపబడుట

5
అదేరీతిగా, క్రీస్తు కూడా ప్రధాన యాజకునిగా అవ్వడానికి తనంతట తానే మహిమను తీసుకోలేదు. అయితే దేవుడే ఆయనతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.”
6
మరొక చోట ఆయన ఇలా అన్నారు, “మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు.”
7
యేసు భూమి మీద జీవించిన రోజుల్లో, మరణం నుండి తనను రక్షించడానికి శక్తి కలిగిన దేవునికి తీవ్రమైన రోదనతో, కన్నీటితో ప్రార్థనలు విన్నపాలు అర్పించారు, ఆయనకున్న భక్తి విధేయతల కారణంగా దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించారు.
8
ఆయన కుమారుడై ఉండి కూడా, తాను అనుభవించిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నారు,
9
ఆయన పరిపూర్ణుడవ్వగానే తనకు లోబడే వారందరికి శాశ్వతమైన రక్షణకు మూలాధారం అయ్యారు.
10
మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకునిగా దేవుని చేత నియమింపబడ్డారు.

ఆత్మీయ అపరిపక్వతకు హెచ్చరిక

11
దీనిని గురించి మేము చెప్పాల్సింది చాలా ఉంది కాని, గ్రహించడానికి మీరు ఏమాత్రం ప్రయత్నించడం లేదు కాబట్టి మీకు వివరించడం కష్టము.
12
నిజానికి, ఈ సమయానికి మీరు బోధకులై ఉండాల్సింది, కాని ఇప్పటికి మీకు మరొకరు దేవుని వాక్యంలోని ప్రాథమిక సత్యాలను బోధించాల్సిన అవసరం ఉంది. బలమైన ఆహారం కాదు, మీకు పాలు అవసరము.
13
పాలు త్రాగుతూ జీవించేవారు ఇంకా శిశువుగానే ఉన్నారు, కాబట్టి నీతిని గురించిన బోధతో పరిచయం లేదు.
14
అయితే బలమైన ఆహారం పరిణతి చెందిన వారికి, అంటే ఎవరైతే నిరంతరం ఉపయోగించడం ద్వారా తమకు తాముగా మంచి చెడులను వేరు చేసే శిక్షణ పొందుకున్నవారికి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options