Skip to content
కీర్తనలు 18:1-18

కీర్తనలు 18:1-18

1
సంగీత దర్శకునికి. యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి సౌలు చేతి నుండి విడిపించినప్పుడు అతడు పాడిన పాట. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. యెహోవా నా బలమా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.
2
యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు నా రక్షణ కొమ్ము, నా బలమైన కోట.
3
స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను, నా శత్రువుల నుండి నేను రక్షించబడ్డాను.
4
మరణపు ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; దుష్టులు వరదలా పొంగి నన్ను ముంచెత్తుతారు.
5
సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; మరణపు ఉచ్చులు నన్ను బంధించాయి.
6
నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; సహాయం కోసం నా దేవున్ని వేడుకున్నాను. తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; నా మొర ఆయన సన్నిధికి, ఆయన చెవులకు చేరింది.
7
భూమి కంపించి అదిరింది, పర్వతాల పునాదులు కదిలాయి; ఆయన కోపానికి అవి వణికాయి.
8
ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది; ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది, దానిలో నిప్పులు మండుతున్నాయి.
9
ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు; ఆయన పాదాల క్రింద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.
10
ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు; ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు.
11
ఆయన చీకటిని తన కప్పుగా, కారు మేఘాలను తన చుట్టూ పందిరిగా చేసుకున్నారు.
12
ఆయన సన్నిధి కాంతి నుండి మేఘాలు, వడగండ్లు, మండుతున్న నిప్పులు కురిసాయి.
13
యెహోవా పరలోకం నుండి ఉరిమారు; మహోన్నతుని స్వరం ప్రతిధ్వనించింది.
14
ఆయన తన బాణాలు విసిరి శత్రువును చెదరగొట్టారు, మెరుస్తున్న గొప్ప పిడుగులతో వారిని తరిమికొట్టారు.
15
యెహోవా, మీ గద్దింపుకు, మీ నాసికా రంధ్రాల్లో నుండి వచ్చే బలమైన ఊపిరికి, సముద్రపు అగాధాలు కనబడ్డాయి భూమి పునాదులు బయటపడ్డాయి.
16
ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు.
17
శక్తివంతమైన నా శత్రువు నుండి, నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు.
18
నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు, కాని యెహోవా నాకు అండగా ఉన్నారు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.