Skip to content
సంఖ్యాకాండము 18:8-19

సంఖ్యాకాండము 18:8-19

8
అప్పుడు యెహోవా అహరోనుతో ఇలా అన్నాడు: “నాకు అర్పించిన అర్పణలకు నేనే నీకు బాధ్యత అప్పగించాను; ఇశ్రాయేలీయులు నాకు ఇచ్చే పరిశుద్ధ అర్పణలన్నీ నేను నీకు, నీ కుమారులకు మీ భాగంగా, మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను.
9
బలిపీఠం మీది నిప్పులో కాల్చివేయబడని అతి పవిత్ర అర్పణలలో కొంత భాగం మీరు తీసుకోవాలి. నాకు వారు తెచ్చే అతి పవిత్రమైన భోజనార్పణలు పాపపరిహారబలులు అపరాధబలులు నీకు, నీ కుమారులకు చెందినవి.
10
అవి అతి పవిత్రంగా ఎంచి తినాలి. ప్రతి మగవాడు అది తినాలి. వాటిని పవిత్రమైనవిగా పరిగణించాలి.
11
“ఇది కూడా మీదే: ఇశ్రాయేలీయులు అర్పించే అర్పణలన్నిటిలో నుండి ప్రక్కన పెట్టబడినది. నేను నీకు, నీ కుమారులు కుమార్తెలకు మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను. మీ ఇంట్లో ఆచార ప్రకారంగా శుభ్రంగా ఉన్న ప్రతి ఒక్కరూ దానిని తినవచ్చు.
12
“యెహోవాకు ఇశ్రాయేలీయులు వారి కోతలో నుండి ప్రథమ ఫలంగా అర్పించే ధాన్యము, ద్రాక్షరసము, నూనె అంతటిని మీకు ఇస్తున్నాను.
13
దేశం పంటలన్నిటిలో యెహోవాకు అర్పించే ప్రథమ ఫలాలు మీకు చెందుతాయి. నీ కుటుంబంలో ఆచార ప్రకారం పవిత్రులందరు వాటిని తినవచ్చు.
14
“ఇశ్రాయేలీయులు యెహోవా కోసం ప్రతిష్ఠించిన ప్రతిదీ నీకు చెందుతుంది.
15
ప్రతి గర్భం నుండి వచ్చిన యెహోవాకు అర్పించబడ్డ జ్యేష్ఠ సంతానం, మనుష్యులైన, జంతువులైన, మీకు చెందుతాయి. కానీ మీరు ప్రతి పెద్ద కుమారున్ని, అపవిత్ర జంతువుల తొలిచూలును విడిపించాలి.
16
ఒక నెల వయస్సున్నప్పుడు పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం అయిదు షెకెళ్ళ వెండితో విడిపించాలి, అంటే ఇరవై గెరాలు.
17
“ఆవులలో, గొర్రెలలో, మేకలలో తొలిచూలును విడిపించకూడదు. అవి పవిత్రమైనవి. వాటి రక్తం బలిపీఠం చుట్టూ ప్రోక్షించి యెహోవాకు సువాసనగా ఉండే హోమంగా వాటి క్రొవ్వును కాల్చివేయాలి.
18
ప్రత్యేక అర్పణలోని బోర, కుడి తొడ ఎలాగో, వాటి మాంసం కూడా మీకు చెందుతుంది.
19
ఇశ్రాయేలీయులు యెహోవాకు తెచ్చే పవిత్రార్పణలను ప్రక్కకు పెట్టినవి నీకు, నీ కుమారులకు, కుమార్తెలకు శాశ్వత వాటాగా ఇస్తున్నాను. ఇది యెహోవా ఎదుట నీతో పాటు నీ సంతానానికి నిత్య ఉప్పు ఒడంబడికగా ఉంటుంది.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options