Skip to content
నెహెమ్యా 1:5-11

ఒప్పుకోలు మరియు విజ్ఞాపన ప్రార్థన

నెహెమ్యా 1:5-11
5
నేను ఆయనకు ఇలా ప్రార్థించాను: “యెహోవా పరలోకపు దేవా, అద్భుతమైన గొప్ప దేవా, మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల మీ ప్రేమ ఒడంబడికను మీరు నెరవేరుస్తారు,
6
మీ సేవకులైన ఇశ్రాయేలు ప్రజల కోసం మీ సేవకుడు పగలు రాత్రి మీ ఎదుట చేస్తున్న ప్రార్థనను వినడానికి మీ చెవిని మీ కళ్లను తెరవండి. నేను, నా తండ్రి కుటుంబంతో సహా ఇశ్రాయేలీయులమైన మేము మీకు వ్యతిరేకంగా చేసిన పాపాలను నేను ఒప్పుకుంటున్నాను.
7
మేము మీ పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాము. మీరు మీ సేవకుడైన మోషేకు ఇచ్చిన ఆజ్ఞలకు, శాసనాలకు చట్టాలకు మేము లోబడలేదు.
8
“మీరు మీ సేవకుడైన మోషేకు ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి, మీరేమన్నారంటే, ‘మీరు నా పట్ల నమ్మకద్రోహులుగా ప్రవర్తిస్తే, దేశాల మధ్యలోకి మిమ్మల్ని చెదరగొడతాను,
9
కానీ ఒకవేళ మీరు నా వైపు తిరిగి, నా ఆజ్ఞలను అనుసరిస్తే చెరగొనిపోబడిన మీ ప్రజలు ఎంత దూరంలో ఉన్నా నేను వారిని అక్కడినుండి సమకూర్చి నా పేరు కోసం నేను నివాసంగా ఎంచుకున్న ప్రదేశానికి వారిని తీసుకువస్తాను.’
10
“వారు మీ సేవకులైన మీ ప్రజలు, మీ గొప్ప బలంతో, శక్తిగల మీ హస్తంతో మీరు విమోచించిన ప్రజలు.
11
ప్రభువా, మీ సేవకుడనైన నా ప్రార్థనను మీ నామం పట్ల భయభక్తులు కలిగి ఉండడంలో ఆనందించే నీ సేవకుల ప్రార్థనను మీ చెవులతో శ్రద్ధగా వినండి. ఈ రోజు ఈ వ్యక్తికి నాపై దయ పుట్టించి మీ సేవకుడనైన నాకు విజయం ఇవ్వండి.” ఆ సమయంలో నేను రాజుకు గిన్నె అందించే వానిగా ఉన్నాను.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.