న్యాయాధిపతులు 8:10-21
10
అప్పుడు జెబహు, సల్మున్నా, ఇంచుమించు పదిహేను వేలమంది బలగంతో, అనగా తూర్పు ప్రజల సైన్యమంతటిలో మిగిలిన వారితో కర్కోరులో ఉన్నారు; లక్షా ఇరవై వేలమంది సైనికులు అప్పటికే చనిపోయారు.
11
అప్పుడు గిద్యోను నోబహుకు, యొగ్బెహకు తూర్పున, గుడారవాసుల మార్గం గుండా వెళ్లి క్షేమంగా ఉన్న శత్రు సైన్యం మీద దాడి చేశాడు.
12
ఇద్దరు మిద్యాను రాజులైన జెబహు, సల్మున్నా పారిపోయారు, కాని అతడు వారిని వెంటాడి పట్టుకుని వారి సైన్యమంతటిని ఓడించాడు.
13
యోవాషు కుమారుడైన గిద్యోను యుద్ధం నుండి హెరెసు కనుమ నుండి తిరిగి వచ్చాడు.
14
అతడు ఒక సుక్కోతు యువకుడిని పట్టుకుని విచారించగా ఆ యువకుడు సుక్కోతు పెద్దలైన డెబ్బై ఏడు అధిపతుల పేర్లు వ్రాసి ఇచ్చాడు.
15
అప్పుడు గిద్యోను సుక్కోతు వారి దగ్గరకు వచ్చి, “నన్ను హేళన చేస్తూ, ‘జెబహు, సల్మున్నాలను నీవు ఇంకా జయించలేదు కదా? నీ అలిసిపోయిన నీ సైన్యానికి మేమెందుకు రొట్టెలివ్వాలి?’ అని మీరు ఎవరి గురించి అన్నారో ఆ సెబహు, సల్మున్నాలు వీరే.”
16
ఆ ఊరిపెద్దలను పట్టుకుని ఎడారి ముళ్ళతో, ముళ్ళపొదలతో శిక్షించి సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు.
17
అతడు పెనూయేలు గోపురాన్ని కూడా పడగొట్టి ఆ పట్టణస్థులను చంపాడు.
18
గిద్యోను, “మీరు తాబోరులో ఎలాంటి మనుష్యులను చంపారు?” అని జెబహును సల్మున్నాను అడిగాడు. అందుకు వారు, “నీలాంటి వారినే, వారంతా రాజకుమారుల్లా ఉన్నారు” అన్నారు.
19
అందుకు గిద్యోను, “వారు నా సోదరులు, నా సొంత తల్లి కుమారులు. మీరు వారిని బ్రతకనిచ్చి ఉంటే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను మిమ్మల్ని చంపేవాడిని కాదు” అన్నాడు.
20
అతడు తన పెద్దకుమారుడైన యెతెరును చూసి, “వారిని చంపు!” అన్నాడు కాని యెతెరు చిన్నవాడు కాబట్టి భయపడి తన ఖడ్గాన్ని దూయలేదు.
21
అప్పుడు జెబహు సల్మున్నాలు, “రా, నీవే చేయు, మనిషిని బట్టి అతని శక్తి ఉంటుంది” అన్నారు. గిద్యోను ముందుకు వెళ్లి వారిని చంపి, వారి ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారాలను తీసుకున్నాడు.
Settings